TTD Chairman: చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. పాలనాపరమైన నిర్ణయాలను శరవేగంగా తీసుకుంటున్నారు. నూతన నియామకాలను చేపడుతున్నారు. ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని భావిస్తున్నారు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తొలుత మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ నడిచింది. అయితే చంద్రబాబు ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి రేసులో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ పదవి ఖాయం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో అధ్యక్ష పదవి భర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా సపోర్ట్ గా టీవీ5 ఛానల్ నిలిచింది. అధినేత బిఆర్ నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటివరకు ఆ సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి దక్కలేదు. అందుకే ఆ సామాజిక వర్గానికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే నిన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చారని వైసీపీ పై ఒక రకమైన ప్రచారం నడిచింది. బి ఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి అప్పగిస్తే కమ్మ సామాజిక వర్గానికి పదవులంటూ వైసీపీ ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే బిసి నినాదం తెరపైకి వస్తోంది. కానీ ఇటీవలే టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కు అప్పగించారు. అందుకే టీటీడీ అధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారని సమాచారం.
మరోవైపు అశోక్ గజపతిరాజు పేరు కూడా వినిపిస్తోంది.క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇవ్వడం సముచితమని, హుందాతనమని, గౌరవించినట్లు అవుతుందని పార్టీ వర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి అశోక్ రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కడం ఆనవాయితీగా వస్తోంది. 2014లో మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఎన్డీఏ ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ దక్కింది. ఆయనకు కీలక పదవి ఇవ్వనున్న నేపథ్యంలోనే ఆయన కుమార్తెకు క్యాబినెట్లోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. పైగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ హయాంలో అశోక్ గజపతిరాజు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కీలక దేవస్థానాలకు ధర్మకర్తగా ఉండడంతో.. ఆయనకు టిటిడి అధ్యక్ష పదవి ఇస్తే సముచితమని పార్టీ వర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.