YCP: వైసీపీకి మరో రాజ్యసభ సభ్యుడు గుడ్ బై చెబుతాడా? ఆ పార్టీని వీడనున్నాడా? ఎనిమిది మందిలో వీడేది ఎవరు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉండేవారు. ఏపీ నుంచి ఇతర పార్టీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో సత్తా చాటింది. అయితే ఆ పార్టీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం లోటు. ఈ తరుణంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం అయింది. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలురాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టిడిపిలో చేరారు. కృష్ణయ్య మాత్రం బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులే కాదు.. వైసీపీ నుంచి చాలామంది ఎంపీలు బయటకు వస్తారని ప్రచారం సాగింది. అయితే వారు ఎవరికివారుగా తాము వైసీపీకి విధేయులుమని.. జగన్ వెంటే ఉండిపోతామని ప్రకటనలు జారీ చేశారు. దీంతో వైసీపీని వీడే రాజ్యసభ సభ్యులు ముగ్గురు మాత్రమేనని తేలింది. అయితే తాజాగా మాత్రం మరొకరు పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తోంది.
*వీరిలో ఎవరు?
ప్రస్తుతం వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు, పరిమళ నత్వాని, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి ఉన్నారు. అయితే ఇందులో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. అయితే మరొకరు రాజీనామా చేస్తారని.. అప్పుడు ఖాళీ అయిన స్థానాలు సంఖ్య నాలుగు కు చేరుకుంటుందని.. ఇలా ఖాళీ అయిన స్థానాన్ని బిజెపికి విడిచి పెట్టేందుకు టిడిపి సిద్ధపడిందని టాక్ నడుస్తోంది.
* ఆ ముగ్గురు తప్ప
వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి తో పాటు విజయసాయిరెడ్డి పార్టీకి అత్యంత విధేయులు. వారిద్దరూ పార్టీని వీడే అవకాశం లేదు. ఇంకోవైపు అయోధ్య రామిరెడ్డి కృష్ణాజిల్లా వైసీపీ సమన్వయకర్తగా ఇటీవలే నియమితులయ్యారు. ఈయన సైతం జగన్ కు విధేయుడు. అయితే మిగతా ఐదుగురు మాత్రం.. ఈ స్థాయిలో జగన్ తో అనుబంధం లేదు. దీంతో వీరిలోనే ఒకరు పార్టీని వీడుతారని ప్రచారం అయితే జరుగుతోంది. ఒకానొక దశలో ఒకరిద్దరు మాత్రమే వైసీపీలో ఉంటారని.. మిగతా రాజ్యసభ సభ్యులంతా పార్టీ మారడం ఖాయమని టాక్ నడిచింది. అయితే జగన్ చర్యలతో అందుకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు మరొకరు పార్టీని వీడడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.