YSRCP Leader Botsa Satyanarayana: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఇప్పుడు నెంబర్ 2 ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డా? లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా? లేకుం వై వి సుబ్బారెడ్డా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కువగా రాజమండ్రిలో గడుపుతున్నారు. కుమారుడు మద్యం కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ఎవరనేది అర్థం కాకుండా పోతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు? అనే మాటకు బొత్స సత్యనారాయణ అనే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోనూ ఇప్పుడు బొత్స కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సైతం బొత్స సత్యనారాయణ పై ఎనలేని నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సీనియర్ల అవసరం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఎన్నడు ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదురు కాలేదు. దానికి కారణాలు లేకపోలేదు. ప్రత్యేక సెంటిమెంట్తో పుట్టిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలహీనం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సీనియర్లంతా జగన్( Y S Jagan Mohan Reddy ) పక్షాన చేరారు. జగన్ మాత్రం సీనియర్లకు ఏమాత్రం అవకాశము ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి మళ్లీ అనంతపురం వరకు సీనియర్లకు పార్టీ వరకు చోటిచ్చారే కానీ.. విధానపరమైన నిర్ణయాలన్నీ ఆ నలుగురు తోనే తీసుకునేవారు. అయితే ఇప్పటివరకు అలానే గడిచింది. కానీ ఇకనుంచి ఆ నలుగురిని పక్కన పెట్టి సీనియర్లకు ఛాన్స్ ఇవ్వక తప్పడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్స లాంటి సీనియర్ అండదండలు అవసరం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు.
బొత్సకు పెరిగిన ప్రాధాన్యం..
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేత. క్యాబినెట్ హోదా సైతం దక్కించుకున్నారు. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. కానీ బొత్స నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. పైగా వైసిపి తరుపున జరుగుతున్న కార్యక్రమాలకు పార్టీ నుంచి హాజరవుతోంది బొత్స మాత్రమే. మొన్న ఈ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి ఓ కాంక్లేవ్ లో అమరావతిపై పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలో వైసిపి రాష్ట్ర వ్యవహారాలను బొత్స సత్యనారాయణకు జగన్ అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీ విధానపరమైన నిర్ణయాలను ఇకనుంచి బొత్స లాంటి సీనియర్లతో చర్చించి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం బొత్స ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారని పార్టీ వర్గాల్లోనే ఒక ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.