AP BJP: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. విపక్షాల మధ్య పొత్తు విషయంలో క్లారిటీ రావడం లేదు. టిడిపి జనసేన మధ్య పొత్తు కుదిరినా.. బిజెపి ఎంట్రీ పై మాత్రం స్పష్టత రావడం లేదు. అదిగో ఇదిగో అన్నమాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన యధాలాపంగా మాట్లాడారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఒంటరి పోరు చేస్తామన్న ఆయన.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం నమ్మదగిన మిత్రులతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని తేల్చి చెప్పారు. ఏపీ విషయంలో త్వరలో పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు.
అటు ఏపీలో సైతం తెలుగుదేశం పార్టీ గుంభనంగా ఉంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుంది. అటు జనసేన సైతం పొత్తుకు మద్దతు తెలుపుతోంది. బిజెపి కలిసి వస్తుందని ఆశాభావంతో ఉంది. తాము ఎన్డీఏ భాగస్వామ్య పక్షమేనని చెబుతోంది. అటు బిజెపి సైతం జనసేన తమ మిత్రపక్షమేనని చెప్పుకొస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొత్తు పై ప్రభావం చూపే ఎటువంటి వ్యాఖ్య చేయకూడదని ఆదేశించారు. ఒకవేళ అభిప్రాయాలు ఉంటే తనకు నేరుగా చెప్పాలని సూచించారు. అంతకుమించి మాట్లాడితే మాత్రం చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు.
మరోవైపు పొత్తుల్లో సింహభాగం నష్టం తమకేనని.. ఉన్న స్థానాలను కోల్పోవాల్సి వస్తుందని.. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి ఉంటుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇంకా బీజేపీతో పొత్తు విషయంలో స్పష్టత రాలేదని చెబుతున్నారు. అటు జనసేనతో కొన్ని సీట్లు, ఇటు బిజెపితో మరికొన్ని సీట్లు కోల్పోవాల్సి రావడంతో టీడీపీ నేతలు ఆందోళన నెలకొంది. జనసేన వరకు ఓకే కానీ.. బిజెపితో పొత్తు వద్దని మెజారిటీ టిడిపి క్యాడర్ కోరుకుంటుంది. అయితే గత అనుభవాల నేపథ్యంలో.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందనుకున్న బిజెపి సహకారం లేకుండా వైసీపీని ఎదుర్కోవడం ఇబ్బందికరమని చంద్రబాబు భావిస్తున్నారు. అటు బిజెపి సైతం పొత్తులు ఉంటాయని చెప్పడంతో.. మరో రెండు రోజుల్లో పొ త్తులు, సీట్ల సర్దుబాటు పై ఒక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.