Chandrababu vs KCR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చతురత ఉన్న నేతలు చంద్రబాబు, కెసిఆర్. రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఎవరికి వారే సాటి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ చదరంగం ఆడగలరు. కానీ ఈ ఆటలో చంద్రబాబు వ్యూహమే ఎక్కువగా పనిచేసింది. కెసిఆర్ ఆలోచన ఆ పార్టీని ప్రమాదంలో పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహించి బయటకు వెళ్లిపోయారు కేసీఆర్. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడి అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టగలిగారు. తెలంగాణలో టిడిపి లేకుండా చేశారు. కానీ ఇప్పుడు అదే టిడిపి ఏపీలో అధికారంలో ఉంది. కేంద్రంలో చక్రం తిప్పుతోంది. తెలంగాణలో సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కెసిఆర్ కిందకు పడిపోయారు.
పనిచేసిన కెసిఆర్ వ్యూహం..
2023 వరకు కెసిఆర్( KCR) వ్యూహాలు పనిచేసాయి. ఏం చేసినా చెల్లుబాటు అయింది. కానీ గర్వం నెత్తికెక్కింది. ఏకంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కునేందుకు సిద్ధపడ్డారు. కేవలం 7, 8 ఎంపీలు ఉన్న పార్టీగా ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అలా చేయాలంటే మరో జాతీయ పార్టీ అవసరం. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయలేకపోయారు. ఒంటరిగానే పోరాటం చేసి హీరోను అనిపించుకోవాలని చూశారు. అటు బీజేపీతో స్నేహం చెడిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి శత్రువు అయ్యారు. కానీ చంద్రబాబు అలా కాదు. బిజెపి నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని భావించారు. అదే బిజెపితో చెలిమి చేశారు. ఎన్డీఏతో మరింత బంధం పెంచుకున్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం పెంచుకోలేదు.
ఒకరికి ఇబ్బంది.. మరొకరికి ప్రయోజనం..
ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రుల మాదిరిగానే కేటీఆర్, లోకేష్ లు ఇద్దరు తెలివైన వారే. కెసిఆర్ కొడుకుగా తన ముద్ర చాటుకున్నారు కేటీఆర్. అయితే అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఎన్నో ప్రతికూలతలను అధిగమించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్. మంచి పరిణితి కనబరుస్తున్నారు. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు పొందుతున్నారు. ఎలాగూ చంద్రబాబు పట్ల జాతీయస్థాయిలో సానుకూలత ఉంది. చంద్రబాబుకు మంచి పాలనా దక్షుడిగా పేరు ఉంది. ఆ పేరును చిరస్థాయిలో ఉండేలా లోకేష్ కృషి చేస్తున్నారు. చంద్రబాబు వారసుడుగా జాతీయస్థాయిలో ప్రమోట్ అవుతున్నారు. తండ్రికి మించి తనయుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ కెసిఆర్ మాత్రం చంద్రబాబు మాదిరిగా ఆలోచించలేదు. రాజకీయ శత్రువులను పెంచుకుంటూ ముందుకు సాగారు. అది ముమ్మాటికి మైనస్.