NTR Centenary Celebrations : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. టాలీవుడ్ అగ్రనేతలకు ఆహ్వానం అందినా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. షూటింగుల్లో బిజీగా ఉండడమో.. ఇతరత్రా కారణాలో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు గైర్హాజరయ్యారు. కానీ తమ తరుపున కుటుంబసభ్యులకు పంపించారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి రాంచరణ్, అల్లు అరవింద్, అక్కినేని వంశం నుంచి నాగచైతన్య, సుమంత్, మహేష్ బాబు కుటుంబం నుంచి బాబాయ్ అదిశేషగిరిరావు, దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ హాజరయ్యారు. అయితే అన్నింటికీ మించి కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అటు పొలిటికల్, ఇటు సినిమా సర్కిల్ లో కొత్త చర్చకు దారితీసింది.
దాదాపు నందమూరి కుటుంబసభ్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప. అయితే ఇందుకు చాలా రకాల కారణాలు ఉన్నట్టు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆహ్వాన పత్రికలు అందించడంలో సముచిత స్థానం కల్పించకపోవడమే కారణంగా తెలుస్తోంది. టాలీవుడ్ లోని ఇతర హీరోలను బాలక్రిష్ణ స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అందించలేదు. ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ చిన్నకుమారుడు రామక్రిష్ణ ఆహ్వాన పత్రికలు అందించారు. కొద్దిరోజులుగా తారక్ తో బాలయ్యకు ఉన్న గ్యాప్ తోనే పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అయితే ఈ పరిణామాలు నందమూరి అభిమానులకు మింగుడుపడడం లేదు. ఎన్టీఆర్ నట వారసుడిగా బాలక్రిష్ణ తెరపైకి వచ్చారు. దశాబ్దాలుగా దానిని కొనసాగిస్తున్నారు. మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వచ్చారు. సినిమాల్లో రాణిస్తున్నారు. విపరీతమైన స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఇది నందమూరి కాంపౌండ్ కావాలి. కానీ బాబాయ్, అబ్బాయ్ మధ్య గ్యాప్ తో నందమూరి అభిమానుల మధ్య చీలిక ఏర్పడింది. రోజురోజుకూ అగాధం పెరుగుతోంది. ఫలితంగా తారక్ శత జయంతి వేడుకలకు గైర్హాజరయ్యారు. అభిమానులు హర్టయ్యారు.
కానీ హరిక్రిష్ణ మరో కుమారుడు కళ్యాణ్ రామ్ వస్తారని అంతా భావించారు. బాలయ్యతో ఆయనకు గట్టి బాండింగే ఉంది. చాలా సన్నిహితంగా ఉంటారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాబాయ్ తో స్క్రీన్ సైతం పంచుకున్నారు. అటువంటి కళ్యాణ్ రాం ఈ ఈవెంట్ కి ఎందుకు రాలేదు అన్నది కూడా చర్చకు వస్తోంది.దీని కంటే కాస్తా వెనక్కి వెళ్తే తారకరత్న దశ దిన కర్మకు జూనియర్ తో కలసి కళ్యాణ్ రాం వెళ్తే ఇద్దరికీ బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు అన్న ప్రచారం వీడియో సాక్షిగా అప్పట్లో చక్కర్లు కొట్టిది. దాంతో మరింతగా దూరం పెరిగింది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో జూనియర్ ఎన్టీయార్ కి అండగా కళ్యాణ్ రాం నిలబడ్డారని అంటున్నారు. అన్నగా తోడు ఉండడమే కాకుండా టోటల్ నందమూరి కుటుంబం నుంచి కూడా ఏకైన మద్దతు దారుగా కళ్యాణ్ రాం ఉన్నారని అంటున్నారు. అంతే కాదు జూనియర్ అడుగు జాడలలో నడిచే వారిగా కళ్యాణ్ రాం ని చెబుతున్నారు. జూనియర్ వెళ్ళని చోటకు తానూ వెళ్లకూడదనే కళ్యాణ్ రాం నిర్ణయించుకుని వెళ్ళలేదన్న టాక్ నడుస్తోంది.