KCR And Jagan: తెలుగు రాష్ట్రాల నేతలు ఏ పార్టీకి భయపడుతున్నారు? జాతీయ పార్టీల్లో ఏ పార్టీ శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ నడుస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో నేతల తిరుగుబాటు వెనుక జాతీయ పార్టీల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణలో కేసిఆర్ కుమార్తె కవిత( Kavita) వ్యవహారం వెనుక ఏ పార్టీ హస్తము ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని.. కెసిఆర్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కవిత బిజెపిలోకి వెళ్తారని కూడా ప్రచారం నడుస్తోంది. తద్వారా బీజేపీ హస్తం ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ప్రాంతీయ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. వాటిపై జాతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ పార్టీని దారికి తెచ్చుకోవడం, లేకుంటే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి తప్పకుండా జాతీయ పార్టీలు ప్రయోగం చేస్తాయి.
* బలమైన ఓటు బ్యాంకుతో ప్రాంతీయ పార్టీలు..
సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలమైన ఓటు బ్యాంకు ను కలిగి ఉంటాయి. వాటితో పోల్చుకుంటే జాతీయ పార్టీలుగా ఉండే బిజెపి( BJP), కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతంత మాత్రమే. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది కెసిఆర్ పార్టీ. ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రాలేదు. అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. దీంతో ఒక ప్రాంతీయ పార్టీగానే కెసిఆర్ పార్టీ మిగిలిపోయింది. అయితే కవిత అరెస్టు తర్వాత ఆ పార్టీ బిజెపిలో విలీనం అవుతుందని అంతా భావించారు. అయితే ఒక్క జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ విలీనం అయితే లాభం కంటే నష్టమే అధికం. అందుకే జాతీయ పార్టీలు ఆ ప్రాంతీయ పార్టీని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయే తప్ప.. విలీనానికి ప్రయత్నించవు. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఏ పార్టీ ఆకర్షిస్తుందంటే చెప్పలేం. అయితే కెసిఆర్ కు కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న అనుమానం కేసీఆర్ కు ఉంది.
* జగన్ సైతం కాంగ్రెస్ పైనే..
ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) బిజెపి కంటే కాంగ్రెస్ విషయంలోనే ఆగ్రహంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా బిజెపితో తెరవెనుక స్నేహం ఆయనకు కలిసి వచ్చింది. అందుకే బిజెపి అడిగిందే తడవుగా అన్నింటికీ మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం ఉంది. బిజెపి విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను జైల్లో పెట్టించిందని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు జగన్. అదే సమయంలో పరోక్ష సహకారంతో తాను అధికారంలోకి వచ్చేందుకు బిజెపి సహకరించిందన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే.. కెసిఆర్ తో పాటు జగన్ కు కాంగ్రెస్ తోనే వైరం ఉంది. బిజెపి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ ఇద్దరు నేతల ఉమ్మడి శత్రువు చంద్రబాబు. కానీ ఆయన మాత్రం ఎన్డీఏలో కీలక భాగస్వామి. అన్నింటికీ మించి తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. అందుకే ఈ విచిత్ర రాజకీయాలు తెలుగునాట నడుస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో చూడాలి.