Boom Boom Beers : దేశంలో ఎక్కడా కనిపించని, వినిపించని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, స్పెషల్ స్టేటస్.. ఇలా పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పేర్లు వినిపించవు. అయితే ఇవి మీ హయాంలో అంటే మీ హయాంలో తయారైనవే అంటూ అధికార, విపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలో బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే అనారోగ్యంతో చనిపోయారంటూ పుకార్లు రేగాయి. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద వార్ జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీలో ఊరూ పేరు లేని బ్రాండ్లు దొరుకుతున్నాయన్నది వాస్తవం. ఈ పేర్లతో మద్యం ఎక్కడ తయారవుతుందో? ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారో తెలియడం లేదు. వాటి ఉత్పత్తి, అమ్మకం ధరలను ఎవరు నిర్ధారిస్తున్నారో తెలియడం లేదు. అయితే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపిస్తోంది. మొత్తం 20 డిస్టిలరీల నుంచి వీటికి మద్యం సరఫరా జరుగుతోంది. ఇందులో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడుపుతోంది. పాత మద్యం పాలసీని రద్దుచేసింది. నేరుగా ప్రభుత్వమే అమ్మకాలు చేపడుతోంది. అయితే అప్పుడే షాపుల్లో కొత్త కొత్త బ్రాండ్లు దర్శనమిచ్చాయి. ధరలు సైతం భారీగా పెంచారు. ఇదేమని ప్రశ్నిస్తే ధరలను చూసి మందుబాబులు వెనక్కి తగ్గుతారని చెప్పుకొచ్చారు. రూ.110 కి లభించే సీసా ధరను రూ.200కు, రూ.100కు లభించే బీరును రూ.220కుపైగా ధర పెంచారు. పోనీ పాత బ్రాండ్లు ఇస్తున్నారంటే అదీ లేదు. అయితే దీనిపై వైసీపీ వాదన భిన్నంగా ఉంది.
మద్యం పాలసీని మార్చంది వైసీపీ సర్కారు. మద్యం ధరలను పెంచింది జగన్ ప్రభుత్వమే. అయినా సరే కొత్త బ్రాండ్లు మాత్రం తమకు తెలియదని చెబుతోంది. అదంతా డిస్టలరీల మహత్యమని చెబుతోంది. అయితే ఇది అంత నమ్మశక్యంగా లేదు. వైసీపీ నేతల కంపెనీల మద్యంగా ప్రచారం ఉంది. పాతబ్రాండ్ల సంస్థలు ఆశించినంతగా కమీషన్ ఇవ్వకపోవడం వల్లే జగన్ అస్మదీయ కంపెనీలకు మద్యం సరఫరా చేసే బాధ్యతలను అప్పగించారని టీడీపీ ప్రచారం చేస్తోంది.
అయితే ఈ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో సాక్షాత్ జగనే ఆ బ్రాండ్లన్నీ టీడీపీ హయాంలో అనుమతించినవేనని చెప్పారు. రాకేష్ మాస్టరు బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే చనిపోయారన్న ఆరోపణలు నేపథ్యంలో సీఎం ప్రకటనను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. టీడీపీ హయాంలో ఉన్నవాటిని రద్దుచేయడాలు, కట్టడాలను కూల్చివేయడాలు చేసిన వైసీపీ సర్కారు ఈ బ్రాండ్లను రద్దుచేసి పాత బ్రాండ్లను పునరుద్ధరించలేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.