Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ కీలక నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన కోరుకున్నచోట సీటు ఇస్తారని కూడా టాక్ నడిచింది. దాదాపు రాధా మొగ్గు చూపారని, ప్రకటన రావడమే తరువాయి అని మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రాధా తో ఆయన స్నేహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అంతా నిజమేనని భావించారు.అయితే అందుకు భిన్న వాతావరణం బయట నెలకొనడం విశేషం.
గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొప్పన భవకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈనెల 21న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధితో కలిసి టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవలే ఆయన లోకేష్ ను కలిశారు. అయితే ఆయన పార్టీలో చేరడానికి మాత్రం వంగవీటి రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు. కొద్దిరోజుల కిందట భవ కుమార్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. టిడిపిలో చేరాలని ఆహ్వానించారు. అయితే ఆయన ఒక్కరితోనే కాదు.. వైసిపి పై అసంతృప్తిగా ఉన్న చాలామంది నాయకులతో రాధాకృష్ణ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. వైసీపీ నుంచి టిడిపిలోకి నేతలను చేర్చే పనిలో ఉన్న రాధాకృష్ణ.. వైసీపీలో ఎలా చేరుతారు అన్నదే ప్రశ్న. దీంతో ఇదంతా ఉత్త ప్రచారమేనని తేలిపోతోంది.
గత ఎన్నికల ముందు రాధాకృష్ణకు వైసీపీలో ఎదురైన అవమానం చిన్నది కాదు. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావని జగన్ తనను అవమానించారని రాధాకృష్ణ చాలాసార్లు మండిపడ్డారు. ఆ విషయాన్ని మరిచిపోనని కూడా చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు అదే వైసిపి నాయకత్వం వంగవీటి రాధాకృష్ణ కోసం కాళ్ళ బేరానికి దిగింది. అయితే సిగ్గు, ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా వైసీపీలో చేరతారా.. మీరే టిడిపిలోకి రావాలంటూ రాధాకృష్ణ సలహా ఇస్తుండడంతో వైసిపి నేతల మైండ్ బ్లాక్ అవుతోంది. 2019 ఎన్నికల్లో రాధాకు టికెట్ ఇవ్వలేదు. నియోజకవర్గంలో చేశారు. చివరకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు నిందలు కూడా వేశారు. ఇవన్నీ మరిచిపోయే స్థితిలో మాత్రం రాధా లేరు.
పోనీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా రాధా విషయంలో నెమ్మదిగా ఉన్నారా? అంటే అదీ లేదు. వంగవీటి మోహన్ రంగాను తిట్టిన గౌతమ్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు. వంగవీటి విగ్రహావిష్కరణకు వెళ్లొద్దంటూ పార్టీ నేతలకు ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ అవసరం రావడంతో ఎంతదాకైనా త్యాగం చేసేందుకు సిద్ధపడుతున్నారు. మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవేవో భ్రమలు కల్పిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ప్రతిపాదనలు పంపుతున్నారు. ఏది కావాలంటే ఆ సీటు ఇస్తామని.. ఆర్థికంగా ఖర్చులు పెట్టుకుంటామని రాయబారం పంపుతున్నారు. చివరకు రాధాకృష్ణ కాశీ ప్రయాణాన్ని సైతం స్నేహితుడు కొడాలి నాని తన ప్రచారానికి వాడుకున్నారు. అయితే రాధాకృష్ణ వైసీపీలో చేరడం కాదు.. వైసీపీ నుంచి భారీ స్థాయిలో నేతలను టిడిపిలోకి ఆకర్షిస్తున్నారు. తనపై మాత్రం ఆకర్ష్ ప్రయత్నం వర్కౌట్ కాదని వైసీపీ నేతలకు తేల్చి చెబుతున్నారు.