Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఆయన జాడలేదు. బిజెపి కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు. అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టిడిపి పీలేరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయనకు రాష్ట్ర పగ్గాలు అందించడంతోపాటు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అటువంటిదేమీ జరగకపోగా కిరణ్ కుమార్ రెడ్డి ఫుల్ సైలెన్స్ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అని చర్చ నడుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబాల్లో నల్లారి ఒకటి. కిరణ్ కుమార్ తండ్రి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మంచి నేతగా ఎదిగారు. 1988లో ఆయన అకాల మరణం చెందారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తన తల్లిని ఉప ఎన్నికల్లో నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అక్కడికి ఏడాదికి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 1989లో నేరుగా రంగంలోకి దిగారు కిరణ్ కుమార్ రెడ్డి. తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 1994లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004, 2009లో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
2004లో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందించారు. వివిధ సమీకరణలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. చీఫ్ విప్ పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించారు. 2009లో కిరణ్ గెలిచేసరికి శాసనసభ స్పీకర్ ఇచ్చి గౌరవించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్య ముఖ్యమంత్రి కావడం.. ఆయన దిగిపోయిన తర్వాత చాలామంది పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే నాలుగుగేళ్లపాటు మంచి పాలన అందించగలిగారు కిరణ్. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని కిరణ్ నాయకత్వం ప్రమాదంలో పడింది.
రాష్ట్ర విభజన ఒకవైపు.. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. తనను సంప్రదించకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి బరిలో దిగారు. అటు తరువాత పార్టీ ఘోర పరాజయంతో పూర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల తరువాత మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. కానీ ఎన్ని రోజులు కూడా అక్కడ ఉండలేకపోయారు. వెంటనే బిజెపిలో చేరారు. గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత బిజెపి కార్యకలాపాల్లో ఎక్కడ కనిపించడం లేదు. కూటమి సమన్వయంలో కూడా ఆయన పాత్ర లేదు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.