Telugu states : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మహోత్సవం కొనసాగుతోంది. 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. ఈ మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందట. అందుకే ఈసారి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. 40 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 10 కోట్లకుపైగా పుణ్యస్నానాలు చేశారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లోనే కుంభమేళా నిర్వహించడానికి ప్రధాన కారణం అది త్రివేణి సంగమ ప్రాంతం. గంగ, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి. అయితే ఇక్కడ సరస్వతి నది కనిపించదు. అంతర్వాహిణిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతారు. గంగ, యమున నదుల సంగమం మనకు కనిపిస్తుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పునర్జన్మ నుంచి ముక్తి పొందుతారని, మోక్షం లభిస్తుందని భావిస్తారు. సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. దీనిని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు..
ఇక త్రివేణి సంగమ ప్రాంతాలు ప్రయాగ్‌రాజ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ మూడు నదులు లేదా ఉప నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాలను త్రివేణి సంగమంగా పిలుస్తారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ప్రనజల భక్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు కూడా ఆ ప్రాంతాలను త్రివేణి సంగమంగా పేర్కొన్నారు.
తెలంగాణ(Telangana)లో..
నిజాబాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తిలో త్రివేని సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలుస్తాయి. నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది నిజామాబాద్(Nizamabad) జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరిలో హరిద్ర, మంజీర నదులు కలుస్తాయి. తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉప నది మంజీర. ఈ త్రివేణి సంగమం వద్ద మూడు ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ పురాతన శివాలయం ఉంది. దీనిని నల్లరాతితో నిర్మించారు. దీంతోపాటు గ్రామంలో రామాలయం, కేశవ స్మృతి మందిరం, స్కంద మాతా ఆలయం కూడా ఉన్నాయి. కందకుర్తిని కాశీ రామేశ్వరాలతో పోలుస్తారు.
కాళేశ్వరం త్రివేణి సంగమం
ఇక తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి,(Jatashankar Bhupalpalli)జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాళేశ్వర శైవక్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ సరస్వతి నదికి ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి(ముక్తీశ్వరుడికి) యమ ధర్మరాజుకి(కాళేశ్వరుడికి) భక్తులు పూజలు చేస్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని సరస్వతి నది, కాళేశ్వరంలోని సరస్వతి నది ఒకటిగానే భావిస్తారు.
సంగం..
నాగావళి, స్వర్ణముఖి, వేదవతి నదుల సంగమ ప్రదేశం సంగం. ఈ త్రివేణి సంగమ ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది. అలాబాద్‌లోని త్రివేణి సంగమానికి సమానంగా దీనిని కొందరు భావిస్తారు. ఇక్కడ సంగమేశ్వరుడి పంచలింగ క్షేత్రం ఉంది.
సంగమేశ్వరం..
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య అధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానది, తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి. వరాహ పర్వతాల్లో పుట్టిన తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడుతాయి. ఆ తర్వాత కర్ణాకలో ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి సమగమేశ్వరం వద్ద కృష్ణనదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని సప్తనదీ సంగమ స్థానం అని, తుంగ భద్ర, కృష్ణ, వేణి, మలపహరిణి, భీమాహారతి, భవనాసి నదులు కూడా ఇక్కడ కలుస్తాయని చెబుతారు.