Resignation of MLCs : వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడుతున్నారు. అయితే వ్యూహాత్మకంగా అటు మండలిలో, ఇటు రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవాలని కూటమి భావిస్తోంది. అయితే రాజ్యసభ పదవులకు సంబంధించి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు. రాజీనామాలకు ఇట్టే ఆమోదం లభిస్తోంది. కానీ ఎమ్మెల్సీల విషయానికి వచ్చేసరికి మాత్రం రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, వివిధ కేసులకు భయపడుతున్న వారు వైసీపీని వీడడం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీని వీడారు. రాజ్యసభ పదవులను వదులుకున్నారు. వారి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ అదే సమయంలో ఎమ్మెల్సీలు సైతం రాజీనామా చేశారు. అవి మాత్రం ఆమోదానికి నోచుకోవడం లేదు. దానికి కారణం మండలి చైర్మన్ గా వైసీపీ నేత ఉండడమే.
* మూడు నెలల కిందట రాజీనామా
వైసీపీని ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మావతి, పోతుల సునీత పార్టీతో పాటు పదవికి రాజీనామా చేశారు. సరైన ఫార్మేట్ లో రాజీనామా పత్రాలను మండలి చైర్మన్ మోసేన్ రాజుకు సమర్పించారు. కానీ ఇది జరిగి మూడు నెలలు దాటుతున్న ఇంతవరకు రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. కనీసం ఆయన రాజీనామా పత్రాలను పరిశీలించలేదని తెలుస్తోంది.తాజాగా ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన రాజీనామా సైతం ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి.
* రాజకీయ కోణంలోనే
కేవలం రాజకీయ కోణంలోనే ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదానికి నోచుకోవడం లేదు. 52 మంది ఎమ్మెల్సీలు ఉండే శాసనమండలిలో వైసీపీ దే సంఖ్యాబలం. ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. అయితే ఎన్నికలకు ముందు కొందరు గుడ్ బై చెప్పారు. మరికొందరిపై అనర్హత వేటు పడింది. ప్రస్తుతం 30 మంది వరకు వైసిపి ఎమ్మెల్సీలు ఉన్నారు. వారితోనే రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారు. మండలి లోకి వచ్చే బిల్లులను అడ్డుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో కూటమి వ్యూహం పన్నుతోంది. వారితో రాజీనామా చేయించి వైసీపీ సంఖ్యాబలం తగ్గించాలన్నది ప్లాన్. దానిని అడ్డుకుంటుంది వైసిపి. తమ పార్టీకి చెందిన చైర్మన్ ద్వారా రాజీనామాలను పక్కన పెడుతోంది. మరి ఈ రాజీనామాలు ఎప్పుడు ఆమోదం పొందుతాయో? అన్నది చూడాలి