AP RTC Buss: ఏపీఎస్ ఆర్టీసీ నవ్వులపాలవుతోంది. మొన్నటికి మొన్న వర్షానికి బస్సులో కారిపోతుండగా ప్రయాణికులు గొడుగులు వేసుకున్నారు. ఇప్పుడు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో మారిన తరువాతే ఆర్టీసీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. బస్సుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మెయింటెనెన్స్ బాగాలేకపోతోందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. కొత్త బస్సుల కొనుగోలు లేవు. ఉన్నవాటికి మరమ్మతులు చేయరు. కొత్తగా సిబ్బందిని భర్తీ చేయడం లేదు. దీనికితోడు రహదారులు బాగాలేకపోవడంతో ఎక్కడికక్కడే బస్సులు మొరాయిస్తున్నాయి.దీంతో ఏపీఎస్ ఆర్టీసీ అంటేనే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. అటు సోషల్ మీడియాలో, ఇటు బయట విమర్శలకు గురిచేస్తున్నాయి.

ఏలూరు జిల్లాలోని నరసాపురం డిపోకు చెందిన బస్సు జాతీయ రహదారిపై ఏలూరు వెళుతుండగా ఆకివీడు మండలం అజ్జమూరు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనుక చక్రాలు రెండూ ఊడిపోయాయి. పెద్ద శబ్దం రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో అటు ఇటుగా వాహనాలు అతి వేగంగా వచ్చినా భారీ ప్రమాదం జరిగేది. ఊహించనంతగా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైవేపై ప్రయాణికులు గంటల తరబడి ఉండిపోవాల్సి వచ్చింది. ప్రయాణికులు కొందరు ఇది మన ఏపీఎస్ ఆర్టీసీ తీరు అంటూ ఊడిపోయిన చక్రాల ఫొటోలను పోస్టు చేశారు. క్షణాల్లో ఇవి వైరల్ గా మారాయి.
రన్నింగులో ఉన్న బస్సు చక్రాలు ఊడడంపై జనసేన, టీడీపీ శ్రేణులు రియాక్టయ్యాయి. సోషల్ మీడియాలో ఫొటోలను వైరల్ చేశాయి. జనసేన కీలక నాయకుడు నాదేండ్ల మనోహర్ ఫొటోను పోస్టుచేశారు. రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని.. వాటిపై బస్సులు, కార్లు, లారీలు, ఇతర వాహనాలు తిరుగుతాయని సీఎం జగన్ కు తెలిసినట్టు లేదని షటైర్ ట్యాగ్ చేశారు. ఇప్పుడిది విపరీతంగా ట్రోల్ అవుతుంది. అటు జన సైనికులు కూడా తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో రహదారు పరిస్థితిపై జనసేన పోరాడుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికైతే వరుసగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి.
[…] […]