Rushikonda: రుషికొండ.. విశాఖలో ఒక పర్యాటక ప్రాంతం. సాగర నగరానికి ఒక ల్యాండ్ మార్క్. నగరంలో అడుగు పెట్టేవారు తప్పకుండా రుషికొండ వెళ్తారు. అక్కడ హరిత హిల్ రిసార్ట్ చూడముచ్చటగా ఉంటుంది. పచ్చదనం పరికిణి వేసుకున్న చందంగా రుషికొండ ఆకట్టుకుంటుంది. అటువంటి రుషికొండను బోడి గుండు కొట్టించారు. పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. పర్యావరణ వేత్తలు, నిపుణులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో కొండను తవ్వేసి బోడి గుండును చేసేశారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన అత్యంత ప్రాజెక్టులను పక్కనపెట్టి.. రూ450 కోట్ల వ్యయంతో ఒక రాజకోటనే నిర్మించారు. కానీ ఆ నిర్మాణం ఎందుకో? అసలు ఎందుకు నిర్మించారో? దాని అవసరం ఏమిటో? అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు.
రుషికొండను ఆనవాళ్లు లేకుండా తవ్వేశారు. భారీ నిర్మాణాలను చేపట్టారు. కొద్ది రోజుల కిందట వైవి సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాధులు ప్రారంభించారు. వేంగి ఏ, వేంగి బి, కలింగ, గజపతి, విజయనగరం ఏ,బి,సి ఇలా మొత్తం 7 బ్లాక్ లను నిర్మించారు. రిసెప్షన్సు, రెస్టారెంట్లు బ్యాంకేట్ హాళ్లు, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి ఈ భవనాల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ నిర్మాణాలు పర్యాటకుల కోసమా? ముఖ్యమంత్రి కార్యాలయం కోసమా? అన్న విషయం చెప్పేందుకు అధికారులు సాహసించడం లేదు. పేరుకు మాత్రమే పర్యాటక రంగానివని చెబుతున్నా.. ప్రభుత్వ పెద్దల అవసరాలకోసమే తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. వీటిని పర్యాటక అవసరాల కోసం వినియోగించాలా? లేదా? అన్నది సీఎం జగన్ నిర్ణయిస్తారని మంత్రి రోజా చెప్పడం విశేషం.
రాష్ట్రంలో ప్రజల అవసరాలకు చాలా ప్రాజెక్టులు కీలకము. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. కేవలం రుషికొండ ప్రాజెక్టులు కీలకమని భావించింది. వందల కోట్లు కుమ్మరించి త్వరితగతిన దీని పనులు చేపట్టింది. భారీ ప్యాలెస్ నిర్మించింది. ఈ నిర్మాణం ప్రారంభించి వారం రోజులు పూర్తవుతున్నా.. దేనికోసం ఉపయోగిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్మాణాలు పూర్తయ్యాయి. కనీసం ఆ శాఖ అధికారులు సైతం నోరు మెదపడం లేదు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన నిర్మాణాలకు ఆర్భాటంగా ప్రారంభాలు చేస్తున్న వైసీపీ నేతలు.. తమ ప్రభుత్వం ఖర్చు చేసిన వాటితో నిర్మించిన రుషికొండ నిర్మాణాల విషయంలో మాత్రం ఏం మాట్లాడకపోవడం విమర్శలకు కారణమవుతోంది.