Thammineni Sitaram: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో ఆమదాలవలస ఒకటి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం. 1999 ఎన్నికల తరువాత తమ్మినేని కి అసలు గెలుపు అవకాశము లేకుండా పోయింది. గత ఎన్నికల్లో జగన్ వన్ చాన్స్ ప్రభంజనంలో తమ్మినేని గెలవగలిగారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన ఎదురీదుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు, సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ మరోవైపు.. ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విజయం కోసం శ్రమించేలా పరిస్థితులు దాపురించాయి.
1983లో టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తమ్మినేని సీతారాం. ఇప్పటివరకు 9సార్లు పోటీ చేశారు. అందులో నాలుగుసార్లు గెలిచారు. ఐదు సార్లు ఓడిపోయారు. ఇప్పుడు పదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఇదే చివరి అవకాశం అని.. గెలిస్తే మంత్రి అవుతానని.. గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. అయితే తమ్మినేనికి సొంత పార్టీ శ్రేణులే సహకరించడం లేదు. ఇక్కడ అసంతృప్తులను, వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో తమ్మినేని ఫెయిల్ అయ్యారు. పైగా గత ఎన్నికల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. అది జరగకపోవడంతో తమ్మినేని పై రైతాంగం వ్యతిరేకంగా ఉంది.
వైసీపీలో నాలుగు వర్గాలకు గాను.. మూడు వర్గాలు సైలెంట్ అయ్యాయి. సీనియర్ నాయకుడు సువ్వారి గాంధీ మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పి.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఈయన సీనియర్ నాయకుడు కావడంతో వైసీపీ శ్రేణులు కూడా ఆదరిస్తున్నాయి. ఇక్కడ వైసిపి ఓట్లు చీలడం ఖాయమని తేలుతోంది. మరోవైపు ఇక్కడ టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ స్ట్రాంగ్ అయ్యారు. టిడిపి శ్రేణుల్లో ఎటువంటి విభేదాలు లేవు. సమన్వయంతో ముందుకు సాగుతుండడంతో ప్రచారంలో ఆ పార్టీ దూసుకుపోతోంది. ఈ పరిణామాల క్రమంలో తమ్మినేని గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్పీకర్ పదవి చేపట్టిన వారు.. తరువాతే ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంట్ చూస్తే తమ్మినేని భవితవ్యం పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.