CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్( davos ) పర్యటన ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సు దావోస్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఈనెల 20న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఒక బృందం దావోస్ బయలుదేరి వెళ్ళింది. ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈరోజు దావోస్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చారు చంద్రబాబు. నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆమెతో చర్చించారు. ఏపీకి సంబంధించి పలు ప్రతిపాదనలు తీసుకెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ కొనసాగింది. దీంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఏపీకి అందుతున్న సాయం
ఇటీవల ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ( Narendra Modi) విశాఖలో రెండు లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గడిచిన ఏడు నెలల వ్యవధిలో ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం చెబుతోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11400 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. అంతకుముందు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా తనవంతు సాయం అందిస్తానని చెప్పుకొచ్చింది. అయితే గతం రెండు ఎన్డీఏ ప్రభుత్వాల్లో.. ఈ తరహా సాయం ఏపీకి దక్కలేదు. ఇప్పుడు కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతోనే.. పెద్ద ఎత్తున నిధులు దక్కుతున్నాయని ప్రచారం ఉంది.
* ఏపీకి ప్రాధాన్యం ఇవ్వండి
ఈసారి కేంద్ర బడ్జెట్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala sitaraman ) ఉన్నారు. సమయం లేకపోవడంతో దావోస్ పర్యటన ముగించుకొని అటు నుంచి అట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. మరోసారి ఏపీకి పెద్ద పీట వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బడ్జెట్ లో ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తెలంగాణతో సమానంగా తమకు నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
* దావోస్ లో బిజీబిజీగా చంద్రబాబు
గత నాలుగు రోజులుగా దావోస్లో బిజీబిజీగా గడిపారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సమయంలో దావోస్ పర్యటన విశేషాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ఇంకోవైపు కేంద్ర సాయం పొందడం ఇప్పుడు టిడిపి సర్కార్ కు టాస్క్ గా మారింది. అయితే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి.