Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: పారిశ్రామిక వేత్తలకు, చంద్రబాబుకు మధ్య ఉన్న గుడ్ విల్ ఏంటి? ఎందుకు ఏపీకి వస్తున్నారు?

Chandrababu: పారిశ్రామిక వేత్తలకు, చంద్రబాబుకు మధ్య ఉన్న గుడ్ విల్ ఏంటి? ఎందుకు ఏపీకి వస్తున్నారు?

Chandrababu: పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఆ రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక విధానాలు సైతం ముఖ్య భూమిక వహిస్తాయి. ఆ తరువాతే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వాటిని ఆకర్షించగలవు. తెలుగు రాష్ట్రాలను ఒకసారి పరిశీలిస్తే.. పారిశ్రామికవేత్తలను ఆకర్షించే లక్షణాలు కేసీఆర్ హయాంలో కనిపించాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి. హైదరాబాదులో ఐటీ రంగానికి చంద్రబాబు బలమైన పునాదులు వేయగలిగారు. కానీ ఆయనను ద్వేషించిన కేసీఆర్ సైతం ఐటి రంగాన్ని వద్దనుకోలేదు. మరింత ముందుకు తీసుకు వెళ్లడం వల్లే తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు వచ్చి పడ్డాయి. అయితే గత ఐదు సంవత్సరాలుగా వైసిపి పరిశ్రమలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. దీంతో జీరో ప్రయత్నం నుంచి చంద్రబాబు ప్రారంభించాల్సి వచ్చింది. అందుకే ఆయన గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఒక ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవిస్తేనే ఆ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏపీ నష్టపోయింది. చంద్రబాబుకు పేరు వస్తుందన్న కోణంలోనే అమరావతిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేవలం రాజధానే కాకుండా.. నాడు చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించారు జగన్. అందుకే పెట్టుబడిదారుల విశ్వసనీయతను కోల్పోయింది ఈ రాష్ట్రం. జగన్ ప్రభుత్వం కూడా పరిశ్రమలు, పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి చూపలేదు అన్న విమర్శ ఉంది. దీనికి తోడు చాలా పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. ఇప్పుడు అదే ఏపీకి శాపంగా మారింది. చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నా పారిశ్రామికవేత్తలు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ముందుగా వారికి ఆంధ్రప్రదేశ్ పై నమ్మకం ఏర్పడితేనే వారు పెట్టుబడులు పెడతారు. ఆ విశ్వాసాన్ని కల్పించే పనిలో పడ్డారు చంద్రబాబు. పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇస్తున్నారు. రాయితీలు, భూములు కేటాయించేందుకు సిద్ధపడుతున్నారు.

పారిశ్రామికవేత్తలను మోటివేట్ చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. రాజకీయాలకు అతీతంగా పరిశ్రమలను, పెట్టుబడులను ప్రోత్సహిస్తారని చంద్రబాబు పై నమ్మకం ఉంది. కానీ గత ఐదేళ్లుగా జరిగిన నిర్వాకం అందరికీ తెలిసిన విషయమే. అందుకే పారిశ్రామికవేత్తలకు ఒక రకమైన అప నమ్మకం ఏర్పడింది. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఏర్పడింది. వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన వారు.. తరువాత వచ్చే ప్రభుత్వాన్ని సైతం ఊహించగలరు. అప్పుడు కూడా జగన్ లాంటి సర్కార్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచిస్తారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రారని తరచూ ప్రకటనలు చేస్తున్నారు. నాడు జగన్ చంద్రబాబు సర్కార్ మొదలు పెట్టిన పనులు పూర్తి చేసి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ జగన్ ఐదేళ్లుగా రాజకీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చి.. పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యంగా విడిచి పెట్టేశారు.

సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెబితేనే చంద్రబాబుని ప్రజలు అధికారంలోకి తెచ్చారు. అదే సమయంలో చంద్రబాబు నుంచి అభివృద్ధిని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సంక్షేమంతో పాటు శాశ్వత అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు చంద్రబాబును నమ్మే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు తన శక్తి యుక్తులను ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించారు. పరిశ్రమల ఏర్పాటుతోనే ఈ రాష్ట్రం నిలబడగలదని గట్టిగా సంకల్పిస్తున్నారు. అయితే ముందుగా పారిశ్రామికవేత్తలకు ధైర్యం ఇచ్చే పనులు చేస్తున్నారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. నాడు పారిశ్రామిక విధానాల రూపకల్పన, అమలు చేయడం వంటి వాటి విషయంలో జాప్యం జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వడం ద్వారా ఆహ్వానిస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version