Nellore YCP: నెల్లూరు వైసీపీకి ఏమైంది?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ కు అత్యంత విధేయుడు. అటువంటి నాయకుడిని చేజేతులా దూరం చేసుకున్నారు. అటు ఆనం రామనారాయణరెడ్డి సీనియారిటీని గౌరవించలేదు.

Written By: Dharma, Updated On : March 2, 2024 9:09 am
Follow us on

Nellore YCP: వైసీపీకి విశేష ఆదరణ ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో పార్టీకి ఏకపక్ష విజయాలు దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో అయితే దాదాపు పార్టీ స్వీప్ చేసింది. అటువంటి జిల్లాలో ప్రస్తుతం వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీలో విభేదాలు, సీనియర్లు పార్టీని వీడటంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడారు. తాజాగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీంతో ఆ పార్టీ విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ కు అత్యంత విధేయుడు. అటువంటి నాయకుడిని చేజేతులా దూరం చేసుకున్నారు. అటు ఆనం రామనారాయణరెడ్డి సీనియారిటీని గౌరవించలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వయసుకు తగ్గ గౌరవం ఇవ్వలేదు. ఈ పరిణామాలతో కలత చెందిన ఒక్కో నాయకుడు పార్టీని వీడుతూ వచ్చారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కూడా పార్టీ తప్పటడుగులు వేసింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చినంత విలువ కూడా.. వేం రెడ్డికి దక్కకపోవడంతో ఆయన పార్టీ వీడాల్సి వచ్చింది. ఆయనతో పాటు చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా లేకపోవడంతో.. ఆయన మార్పు అనివార్యంగా మారింది. ఆయనకు నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. కానీ నెల్లూరు అసెంబ్లీ సీటును డిప్యూటీ మేయర్ ఖలీల్ కు ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని వేంరెడ్డి వ్యతిరేకించారు. మరో డిప్యూటీ మేయర్, అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ జగన్ వినలేదు. దీంతో అటు వేమిరెడ్డి, ఇటు రూప్ కుమార్ యాదవ్ తో పాటు నెల్లూరు కార్పొరేషన్ లో మెజారిటీ కార్పొరేటర్లు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.దీంతో నెల్లూరు అసెంబ్లీ స్థానంలో ఓటమి తప్పదు అన్న సంకేతాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేస్తే కేవలం 700 ఓట్లతో అనిల్ గట్టెక్కారు.

మరోవైపు సీనియర్లుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి సైతం పార్టీని పెడతారని తెలుస్తోంది. మహీధర్ రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని కందుకూరులో తెచ్చారు. దీంతో మహీధర్ రెడ్డి మనస్థాపంతో ఉన్నారు. అటు నెల్లూరు రూరల్ లో సైతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేంరెడ్డి లాంటి నమ్మకమైన నేత వైసీపీని వీడుతుండడంతో.. ఆయనను చాలామంది నేతలు అనుసరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నెల్లూరు జిల్లా వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ సాయి రెడ్డి జూనియర్లతో ఎలా నెట్టుకోస్తారో చూడాలి.