Vishaka MLC Election : వైసిపి బలమా? టిడిపి త్యాగమా? విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో జరిగిందేంటి?

సాధారణంగా అధికార పక్షం అంటే దూకుడుగా ఉంటుంది. అందులోనూ రెండు నెలల కిందట ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. అయినా సరే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ కూటమి భయపడింది.

Written By: Dharma, Updated On : August 15, 2024 9:58 am

Vishaka MLC Elections

Follow us on

Vishaka MLC Election :విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమే. టిడిపి కూటమి పోటీ పెట్టకపోవడంతో బొత్స కు లైన్ క్లియర్ అయ్యింది. ఉన్నఒక్క ఇండిపెండెంట్ నామినేషన్ విత్ డ్రా కావడంతో బొత్స ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. కానీ అధికారికంగా శనివారం ప్రకటించనున్నారు. అయితే అధికార పార్టీగా ఉన్న టిడిపి కూటమి ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోవడం ఆసక్తికరమే. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అందుకే ఆ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన జనసేనలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయించింది వైసిపి. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్థానిక సంస్థల్లో బలం ఉన్న దృష్ట్యా.. ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోకూడదని భావించారు.అందుకే బలమైన అభ్యర్థి అవుతారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోదించారు. అయితే బలమైన ప్రత్యర్థి కావడంతో టిడిపి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తీవ్ర మల్ల గుల్లాలు నడుమ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించింది. దీంతో బొత్స కు లైన్ క్లియర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీకి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ దక్కడం ఆ పార్టీ శ్రేణులకు ఊరట నిచ్చింది. అయితే ఇది వైసీపీ సంబరాలు చేసుకునే విజయం కాదు. అధికార పక్షం హుందాగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* గెలవడం అంత కష్టం కాదు
అయితే ఒక్క ఎమ్మెల్సీ తో పోయేదేముందని టిడిపి కూటమి అంచనా వేసింది. ఒక మంచి వాతావరణానికి శ్రీకారం చుట్టినట్లు టిడిపి ప్రచారం చేసుకుంటుంది. వాస్తవానికి అధికారపక్షంగా ఉన్న టిడిపి కూటమికి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకమే. విశాఖ జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం అంత కష్టం కాదు. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను.. టిడిపి కూటమి 13 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం తప్పకుండా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత చాలామంది పార్టీలు మారారు. దాదాపు రెండు పార్టీలకు చెరి సగం బలం ఉంది. అయినా సరే అధికారపక్షం పోటీ చేసేందుకు సాహసించలేదు.

* బలమైన అభ్యర్థి అవుతారనే
సాధారణంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలంటే ప్రలోభాల పర్వం. ఇది బహిరంగ రహస్యం కూడా. జగన్ ఈ అంచనాకు వచ్చే ఆర్థికంగా బలమైన అభ్యర్థి అవుతారని బొత్సను ఎంపిక చేశారు. అటు టిడిపి నుంచి సైతం బలమైన నేతలు రెడీగా ఉన్నారు. కానీ బలం లేని చోట పోటీ చేసి గెలిచినా.. ఒక రకమైన విమర్శ వస్తుంది. ఒకవేళ ఓడిపోతే రెండు నెలలకే టిడిపి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విపక్షానికి ప్రచారాస్త్రంగా మారుతుంది. అందుకే చంద్రబాబు సైతం పునరాలోచనలో పడ్డారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని.. పోటీ చేయకపోవడమే ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చారు.

* ఆనవాయితీని బ్రేక్ చేసిన వైసిపి
గత ఐదేళ్లుగా ఉప ఎన్నికల విషయంలో వైసిపి తప్పిదాలకు పాల్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సైతం గత ఆనవాయితీలను బ్రేక్ చేసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండేది కాదు. ప్రజా సంఘాలు, వామపక్షాలు మాత్రమే పోటీ చేసేవి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడం ప్రారంభించారు. ఇది ప్రజా సంఘాలతో పాటు వామపక్షాల్లో వ్యతిరేకతకు కారణమైంది. బలం లేనిచోట్ల సైతం బలం ప్రదర్శించే గుణం వైసీపీ ది. అందుకే ఇప్పుడు బలం లేనిచోట తగ్గిపోయిన చంద్రబాబు.. నాడు వైసీపీ తప్పులను గుర్తు చేసేలా వ్యవహరించారు. ఒక్క ఎమ్మెల్సీ కోసం లేనిపోని పోరాటాలు చేయడం వృధా ప్రయాసగా తేల్చేశారు.