Welfare Schemes In AP: ఏపీలో( Andhra Pradesh) సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించి టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తో సహా పలు కీలక పథకాలను జూన్ 12న అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన కేంద్రానికి, సైన్యానికి పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు దక్కడం పై అభినందనలు తెలిపింది పొలిట్ బ్యూరో. మరోవైపు పార్టీ పరంగా కూడా ఓ ని కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడుసార్లు వరుసగా ఒకే పదవిలో పనిచేసిన వారిని తప్పించి.. వారికి వేరే పదవులు ఇవ్వాలన్న నారా లోకేష్ ప్రతిపాదనను ఆమోదం తెలిపారు. దీనిని తొలుత టిడిపిలో మండలాధ్యక్షులతో అమలు చేయనున్నారు. దీంతోపాటు ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు.
Also Read: టాలీవుడ్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
* సంక్షేమ పథకాలపై చర్చ..
సంక్షేమ పథకాలు( welfare schemes) చుట్టూ సమావేశంలో చర్చ నడిచింది. దీపం పథకం డబ్బులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ ముందే ఇవ్వాలని నిర్ణయించారు. యాడాదిలో ఇచ్చే మూడు సిలిండర్ల డబ్బులు ముందే ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్న.. తీసుకోకపోయినా ముందుగానే ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తారు. జూన్ 12 నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలు ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించనున్నారు. మహిళల ఉచిత బస్సు పథకం కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పారు.
* ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని..
అయితే ఒకేసారి ప్రజల్లో సంతృప్తి శాతం పెంచాలని సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఆలోచన చేస్తున్నారు. ప్రధాన సంక్షేమ పథకాలు ఏవి ఇంతవరకు అమలు ప్రారంభం కాలేదు. పింఛన్లు మొత్తం పెంచి అందిస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే ఈ పథకం విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ప్రభుత్వం నగదు జమ చేస్తుంది కానీ లబ్ధిదారుల్లో ఆ స్థాయిలో సంతృప్తి లభించడం లేదు. అందుకే గ్యాస్ సిలిండర్ విడుదలకు ముందే.. లబ్ధిదారుల ఖాతాల్లో ఉచితానికి సంబంధించి నగదు జమ చేయనున్నారు. గ్యాస్ సిలిండర్ విడుదలతో సంబంధం లేకుండా.. నగదు జమ చేయడం ఉండడంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
* పథకాల కోసం ఎదురుచూపు..
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పనులు ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే కేంద్ర పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయనుంది. ప్రతి నాలుగు నెలలకు 2000 రూపాయల చొప్పున అందిస్తూ వస్తుంది కేంద్రం. ఆ మొత్తం తోనే మూడు విడతల్లో 14 వేల రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం అందించే 6000 మొత్తం తో.. ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు తల్లికి వందనం పథకం కూడా అమలు చేసేందుకు జూన్ 12న ముహూర్తం గా ఫిక్స్ చేశారు. అదే రోజు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువుకు సాయం అందించనున్నారు. మొత్తానికి అయితే ఒకేరోజు కీలక పథకాలను ఫిక్స్ చేస్తూ అమలు చేయాలని నిర్ణయించడం నిజంగా సంచలనమే.