VV Lakshmi Narayana: ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది.. తమ లక్ష్యం నెరవేరకముందే నిష్క్రమించారు. ఎంతోమంది నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలో చేరారు సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ( VV Lakshmi Narayana ). వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని.. అవినీతిని అంతం చేస్తానని చెప్పేవారు లక్ష్మీనారాయణ. కానీ ఆయన ప్రస్థానంలో ఊహించని మలుపు. ఒకప్పుడు ఐపీఎస్ హోదాలో ఎన్నో కీలక కేసులను దర్యాప్తు చేసిన ఆయన.. ఉన్నత కొలువును వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరిపోయారు. మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని.. రాజకీయాలు మాట్లాడరని తేలిపోయింది.
జాతీయస్థాయిలో గుర్తింపు..
ఏపీకి చెందిన వీవీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారిగా జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు. కడప( Kadapa ) జిల్లాకు చెందిన ఆయన కుటుంబం కర్నూలులో స్థిరపడింది. ఐపీఎస్ అధికారిగా ఎంపికైన ఆయన సిబిఐ లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2008- 2013 మధ్య ఆయన పేరు మార్మోగిపోయింది. సిబిఐ అధికారిగా సత్యం రామలింగం రాజు, గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులు వంటివి దర్యాప్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల దర్యాప్తు కూడా ఆయనే జరిపారు. పారదర్శకంగా కేసుల విచారణ చేపడతారని మంచి పేరు ఉండేది. అయితే 2014 తర్వాత తన మాతృ శాఖ మహారాష్ట్రకు వెళ్లాల్సి వచ్చింది. అయితే దక్షిణాది రాష్ట్రాలతో అనుబంధం, సొంత రాష్ట్రం ఏపీలో ఉండాలన్న కోరికతో ఉండేవారు. అలా 2018లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మంచి వాగ్దాటి..
మంచి వాగ్దాటి ఉన్న వివి లక్ష్మీనారాయణ ప్రసంగాలు బాగా చేయగలరు. ఆయన ఇంటర్వ్యూలు యువతను బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) నేతృత్వంలోని జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానానికి పరిమితం అయినా.. మూడు లక్షలకు పైగా ఓట్లు సొంతం చేసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన ఓడిపోయింది. వివి లక్ష్మీనారాయణ జనసేన కు రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని కారణంగా చూపారు. తరువాత వివి లక్ష్మీనారాయణ సమకాలీన అంశాలతో పాటు ప్రజా సమస్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో జై భారత్ పార్టీని ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ చెయ్యలేదు. ఇటీవల ఓ సైబర్ నేరానికి గురై కోట్లాది రూపాయలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఏడు సంవత్సరాల సర్వీసు ఉండగానే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్థిక కష్టాలు వెంటాడడంతోనే ఈ కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
రాజకీయాలు మాట్లాడకూడదు..
వివి లక్ష్మీనారాయణ కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా మారడంతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పారు అన్నది విశ్లేషకులు మాట. ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకున్న ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం కుదరదు. అలా మాట్లాడకూడదు కూడా. అయితే వైస్ ప్రెసిడెంట్ పదవి అంటే అది గౌరవప్రదమైనది కావచ్చు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తి ఇది ఒక మెట్టు దిగడమే అన్న టాక్ ఉంది. ఎందుకంటే జాతీయస్థాయిలోనే ఒక ఐపీఎస్ అధికారిగా సుపరిచితులు ఆయన. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు బలమైన కారణాలతోనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరారు అనిపిస్తోంది.