Vundavalli Aruna Kumar: రాజకీయాలు వదిలి పొలిటికల్ విశ్లేషకుడిగా మారారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Arun Kumar ). తనకు ఎటువంటి రాగద్వేషాలు లేవని.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెబుతుంటారు ఉండవల్లి. అయితే ఆయన మాటల్లో ఎక్కడో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆ కుటుంబం పట్ల ఫీవర్ కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. 2014 నుంచి 2019 మధ్య విశ్లేషకుడిగా అవతారం ఎత్తారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు సర్కార్ విధానాలను తప్పు పట్టేవారు. కానీ 2019 నుంచి 2024 మధ్య మాత్రం జగన్ సర్కార్ వైఫల్యాలను ఆ స్థాయిలో ఎత్తి చూపలేదు. జగన్మోహన్ రెడ్డిని సుతిమెత్తగా విమర్శిస్తూ.. చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం గట్టి ఉదాహరణలతోనే విమర్శలు చేస్తుంటారు.
Also Read: పాకిస్తాన్ పై భారత్ దాడి.. వీడియోలు వైరల్
* జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూనే..
తాజాగా మీడియా ముందుకు వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy) కక్ష సాధింపులు వద్దు అని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ధైర్యం ఉంటే నేతలను అరెస్టు చేసుకోండి కానీ అధికారులను బాధ్యులు చేస్తారు ఎందుకు అని ప్రశ్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును వెనుకేసుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీపరుడు అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు సర్కారులో సైతం ఎస్పీగా పని చేశారని.. అవినీతిని ఉక్కు పాదంతో అణచివేశారని గుర్తు చేసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారని చెప్పుకొచ్చారు. ఇక్కడ వరకు ఓకే. కానీ గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులను కేసులతో వేధించినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు సలహా ఇవ్వలేదన్నది ఇప్పుడు ఆయన లాంటి మేధావులకు తలెత్తుతున్న ప్రశ్న.
* ఆ ఘటనకు బాధ్యులెవరు?
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు( Chandrababu) ఉన్నప్పుడు రాళ్లదాడి జరిగింది. అప్పుడు బాధ్యతాయుతమైన అధికారి స్థానంలో ఉన్నారు పీఎస్ఆర్ ఆంజనేయులు. కానీ తిరిగి చంద్రబాబుపై కేసులు పెట్టారు. టిడిపి నేతలను జైల్లోకి పంపించారు. అప్పట్లో కీలక అధికారిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర కీలకం. కానీ అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎటువంటి ప్రకటన చేయలేదు. విశ్లేషణలు చేయలేదు. అంతెందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు జరిగి రోజులు గడుస్తోంది. కానీ ఒక్క వైసీపీ నేత కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పలేదు. ఉండవల్లి కూడా చెప్పడం లేదు. ఆయనను జైల్లో పెట్టారని తెగ బాధ పడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఉండవల్లిలో వైసిపి ఫ్లేవరు, ఫేవర్ కనిపిస్తోంది.
* విమర్శల స్థాయిలో తేడా..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) . అప్పటి మద్యం పాలసీని అదే పనిగా ప్రశ్నించేవారు ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రెస్మీట్లో మద్యం బాటిల్ పై ఎంత వస్తుందో చెప్పేవారు. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో కూడా విశ్లేషించేవారు. కానీ గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో తెలియనిది కాదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. టిడిపి సర్కార్ పై చేసిన మాటల దాడి చేయలేదు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమవాడిగా చూసుకుంటుంది. మిగతావారు మాత్రం ఆయనను విశ్లేషకుడు కంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేసే పెద్ద మనిషిగా భావిస్తున్నారు.