Shock to YCP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం కానుంది. గతంలో తప్పుడుగా నమోదు చేసిన ఓట్లు, బినామీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగించనున్నారు. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనిని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దొంగ ఓట్ల తొలగింపు అనేది ఆహ్వానించ దగ్గది అయినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో భయపడుతోంది. అయితే గతంలో తమ హయాంలో నమోదైన ఓట్లు తొలగిస్తారు అన్న భయం ఆ పార్టీని వెంటాడినట్టు ఉంది. అయితే కచ్చితంగా అవి పారదర్శకమైన ఓట్లు అయితే ఎవరూ తొలగించలేరు. ఇప్పుడు వైసీపీ భయం చూస్తుంటే మాత్రం.. ఆ ఓట్లపై అనుమానం కలుగుతోంది.
ప్రత్యర్థి ఓట్ల తొలగింపు..
అప్పట్లో ఐపాక్ ద్వారా ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫారం 7 సమర్పించి చాలా తప్పిదాలకు పాల్పడ్డారు. అదే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. కానీ ఇప్పుడు అటువంటి ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియపై కోర్టుల్లో పిటిషన్లు వేయించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే తమ ఓట్లు పోతాయి అనేదానికంటే.. ఎందుకో భయపడుతున్నట్టు అర్థం అవుతోంది. అప్పట్లో నమోదు చేసిన ఓట్లు తొలగిస్తారు అన్న ఆందోళన స్పష్టమవుతోంది.
ఆ 40 శాతం లో గల్లంతయితే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు 40 శాతం ఓట్లు వచ్చినట్లు సగర్వంగా చెబుతోంది. అవే ఓట్లు తమకు ఈసారి స్థిరంగా ఉండి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు చిక్కి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళనతో ప్రతి నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. అందులో వైసిపి హయాంలో నమోదు చేసినవి రద్దు అయితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే. పైగా ఈ ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఆపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి. ఈ కారణాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే ఈ ప్రక్రియ పై కోర్టుకు వెళ్లేందుకు ఆ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
