AP Volunteers: ఏపీలో దగాపడ్డ వాలంటీర్లు

వాలంటీర్లకు నెలకు సగటు జీతం ఐదు వేల రూపాయలు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకంటే, ప్రభుత్వం కంటే వారు వైసీపీకి ఎక్కువగా పని చేశారు. వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటుపడ్డారు.

Written By: Dharma, Updated On : March 24, 2024 2:57 pm

AP Volunteers

Follow us on

AP Volunteers: వాలంటీర్లు.. స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే పవర్ ఫుల్. అంతలా వారికి హక్కులు, విధులు కల్పించారు. సూపర్ పవర్స్ ఇచ్చారు. అయితే అవి అంతవరకే పరిమితం. ఆ పవర్స్ ఏవీ వాలంటీర్ల భవిష్యత్తుకు అక్కరకు రాలేదు. ఎన్ని రకాల పవర్స్ ఇచ్చినా.. హక్కులు కల్పించినా వాలంటీర్లకు ఎటువంటి భరోసా లేకుండా పోయింది. ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. అయితే వారి సేవలను తప్పుపడుతూ విపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు తొలగించబడుతున్నారు.

వాలంటీర్లకు నెలకు సగటు జీతం ఐదు వేల రూపాయలు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకంటే, ప్రభుత్వం కంటే వారు వైసీపీకి ఎక్కువగా పని చేశారు. వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటుపడ్డారు.వైసిపి భావజాలం ఉన్నవారు ఎక్కువగా వాలంటీర్లుగా ఉన్నారు. అందుకే అటువంటివారు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులోత్తారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో వారి అవసరం నేతలకు ఏర్పడింది. అందుకే మీరు రాజీనామా చేయండి. ఆ నెల జీతం మేము ఇస్తామంటూ వైసీపీ నేతలు ఆఫర్ ఇస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే కదా.. మళ్లీ వాలంటీర్లుగా మిమ్మల్ని కొనసాగిస్తామని భ్రమ కల్పిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాలంటీర్లు రాజీనామా చేసి వైసిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వారి చేతిలో పవర్ ఉన్నంతవరకే ఎవరైనా వారి మాట వింటారు. కానీ వాలంటీర్ జాబ్ వదులుకొని ఆ 50 కుటుంబాల వద్దకు వెళితే.. ప్రజలు స్పందించే తీరు మారిపోతోంది.

మరోవైపు విపక్షాలతోపాటు వైసీపీ వ్యతిరేక మీడియా డేగ కన్ను వేస్తోంది. ఎక్కడైనా వాలంటీర్లు ప్రచార సభల్లో కనిపిస్తే వారి ఫోటోలను ఇట్టే పై అధికారులకు పంపిస్తున్నారు. ఈ విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అతిగా స్పందిస్తోంది. ఎక్కడైనా వలంటీర్లు, రేషన్ డీలర్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొంటే క్షణాల్లో వారి ఫోటోలు ఎలక్షన్ కమిషన్ అధికారులకు చేరుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూటమిలో ఉండడంతో అధికారుల సైతం శరవేగంగా స్పందిస్తున్నారు. వారిని తొలగిస్తున్నారు. మరోవైపు రేపు ప్రభుత్వం మారిన తరువాత ఎలాగూ టిడిపి నేతలు తమను టార్గెట్ చేస్తారని చాలామంది వాలంటీర్లు బాధపడుతున్నారు. ఇలా ఫలితాలు వచ్చిన మరుక్షణం రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇలా ఎలా చూసినా వాలంటీర్లు బలి పశువులు అవుతున్నారు. విలువైన ఐదేళ్ల సమయాన్ని వృధా చేశామని బాధపడుతున్నారు. ఈ ఐదేళ్లపాటు మరో ప్రైవేటు ఉద్యోగం చేసినా.. ఉన్నత కొలువు, మంచి జీతం పొంది ఉండే వారమని చెప్పుకొస్తున్నారు.