Floating Bridge: లోకేష్… ఫ్లోటింగ్ బ్రిడ్జి గురించి తెలుసుకో

సరిగ్గా నారా లోకేష్ ట్విట్ సమయంలోనే అధికారులు ఈ తరహా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేరుగా లోకేష్ కి సమాధానం ఇచ్చినట్టు అయ్యింది. అటు వైసీపీ శ్రేణుల సైతం లోకేష్ తీరును తప్పు పడుతున్నాయి.

Written By: Dharma, Updated On : February 27, 2024 12:15 pm

Floating Bridge

Follow us on

Floating Bridge: విశాఖ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేటు వ్యక్తి రూ.1.60 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కి విఎంఆర్డిఏ అధికారులు అనుమతి ఇచ్చారు. ఏడాదికి 15 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆదివారం ఈ బ్రిడ్జి ను మంత్రి గుడివాడ అమర్నాథ్, వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు. సోమవారం నాటికి ఈ బ్రిడ్జి తెగిపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

అయితే ట్రయల్ రన్ పూర్తి చేశామని.. ఇంకా పూర్తిస్థాయిలో బ్రిడ్జి అందుబాటులోకి రాలేదని అధికారులు ప్రకటించడం విశేషం. అక్కడితో ఆగని విఎంఆర్డిఏ అధికారులు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.’ 26వ తేదీ నుంచి సందర్షకులను అనుమతించాలనుకున్నాం. అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఈ సమయంలో వంతెన టీ పాయింట్ పటిష్టత పరిశీలించేందుకు దాన్ని విడదీశాం. వంతెన న్యూ పాయింట్ మధ్య ఖాళీ ప్రదేశాన్ని కొందరు ఫోటో తీసి దుష్ప్రచారం చేస్తున్నారు. సాంకేతిక పరిశీలనలో భాగంగా ఇదంతా చేశాం’ అంటూ విఎంఆర్డిఏ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయడం విశేషం.

సరిగ్గా నారా లోకేష్ ట్విట్ సమయంలోనే అధికారులు ఈ తరహా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేరుగా లోకేష్ కి సమాధానం ఇచ్చినట్టు అయ్యింది. అటు వైసీపీ శ్రేణుల సైతం లోకేష్ తీరును తప్పు పడుతున్నాయి. ఇంకా ట్రయల్ రన్ లో ఉన్న బ్రిడ్జిపై లేనిపోని దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే లోకేష్ ట్వీట్ తోనే విఎంఆర్డిఏ అధికారులు ప్రత్యేక ప్రకటన జారీ చేయడం రాజకీయ అంశంగా మారిపోయింది.