Vizianagaram Terror Conspiracy: ఏపీలో( Andhra Pradesh) ఉగ్ర మూలాలు ఆ మధ్యన ప్రకంపనలు సృష్టించాయి. విజయనగరంలో ఉగ్ర కదలికలు రావడం కుదిపేసింది. సిరాజ్ వుర్ రెహమాన్, సయ్యద్ సమీర్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో రెహమాన్ విజయనగరానికి చెందిన వ్యక్తిగా.. సమీర్ హైదరాబాద్ బోయగూడ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. వీరిద్దరూ ఉగ్రవాద కుట్రలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ పరిచయం అయినట్టు గుర్తించారు. ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నారని తేల్చారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చకు దారితీసింది.
* ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో..
ఈ ఏడాది మే 16న ఉగ్రవాద అనుమానిత చర్యలతో వీరిద్దరిని పోలీసులు( AP Police ) అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. అటు తరువాత కోర్టు అనుమతితో వారిని వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకొని NIA, యాంటీ బాంబు స్క్వాడ్, ఇతర టెర్రరిస్ట్ నిరోధక విభాగాలు కలిపి వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాయి. విచారణ అనంతరం కోర్టు మరోసారి రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. సిరాజ్ విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు. అయితే సమీర్ తో కలిపి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. వీరికి ఎప్పటికప్పుడు ఇమ్రాన్ అనే హ్యాండ్లర్ ఆదేశాలు ఇస్తుంటాడు. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ పంపిన డబ్బుతోనే సిరాజ్ పేలుడు పదార్థాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవాడు. విశాఖలోని రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* లోతుగా దర్యాప్తు కోసం..
ఇందులో అరెస్ట్ అయిన విజయనగరం( Vijay Nagaram ) యువకుడు సిరాజ్ తండ్రి తో పాటు సోదరుడు పోలీస్ శాఖ లోనే పనిచేస్తున్నారు. సిరాజ్ బీటెక్ వరకు చదువుకున్నాడు. ప్రేరేపిత ఉగ్రవాదం వైపు అడుగులు వేశాడు. దేశవ్యాప్తంగా ఆరుగురు సభ్యులతో వీరి బృందం ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఎంతవరకు వీరిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు జరిపారు. 20 మంది వరకు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్ర సంబంధాలను అన్వేషిస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసులు మరింత లోతుగా దర్యాప్తు అవసరమని భావించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అధికారికంగా కేసును NIA కు బదిలీ చేసింది.