AP Appalanaidu Video Viral: ఆయన ఓ సామాన్య నాయకుడు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. ప్రజల మధ్యనే తిరిగాడు. పార్టీ కోసం చిత్తశుద్ధితో కృషి చేశాడు. అనూహ్యంగా ఆయనను అధినేత గుర్తించారు. రాజుల కోటలోనే ఎంపీగా టికెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో గెలిచారు. ఓ సామాన్య నేత పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఆయన తాను ఉన్న స్థానాన్ని మరువలేదు. ఎక్కడి నుంచి వచ్చానో అన్నది మరిచిపోలేదు. ఒక్క పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా.. సాధారణ నేతగానే ఉండేందుకు ఇష్టపడతారు.. ఆయనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తాను ఎంపీనన్న దర్పం లేదు. తాజాగా ఆయన రోడ్డు పక్కన ఉండే చిన్నపాటి దుకాణంలో టిఫిన్ చేయడానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దర్పాన్ని పక్కనపెట్టి..
సాధారణంగా ఎంపీ అంటే ఆ దర్పం వేరు.. దర్జా వేరు. కానీ అప్పలనాయుడు(apala Naidu ) మాత్రం తనలో వాటికి చోటు ఇవ్వరు. పార్లమెంటుకు సైకిల్ పై వెళుతున్న ఘనత ఆయనది. పార్లమెంట్ సమావేశాలకు కచ్చితంగా హాజరవుతారు. అక్కడ జరిగే బలమైన చర్చల్లో భాగస్వామ్యులవుతారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆత్రం ప్రదర్శిస్తారు. అయితే ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. కానీ అప్పలనాయుడు మాత్రం తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు, అదే సమయంలో పార్లమెంటు సమావేశాలకు హాజరు.. ఇలా అన్ని అంశాల్లో క్రమశిక్షణ కనబరుస్తూ వస్తున్నారు. అందుకే మొన్న ఆ మధ్యన ప్రధాని మోదీని టిడిపి ఎంపీలు కలుసుకుంటే.. కలిశెట్టి అప్పలనాయుడు తనకెందుకు తెలియదు అనే మాదిరిగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో గుర్తింపు పొందారో అర్థం అవుతుంది.
రాజుల కోటలో పాగా..
వాస్తవానికి విజయనగరం( Vijayanagaram) అనేది రాజుల కోట. పూసపాటి వంశీయుల పెత్తనం అక్కడ కొనసాగేది. అటువంటి చోట మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పిలిచి మరి అప్పలనాయుడు కు టికెట్ ఇచ్చారు. ఓ సామాన్యుడిని లోక్సభకు పంపించండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని విజయనగరం పార్లమెంటరీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అఖండ మెజారిటీతో గెలిపించారు. కానీ అప్పలనాయుడు ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలుసు. అందుకే ఎంపీగా ఎన్నికైన తొలినాళ్లలో.. ఏం అప్పలనాయుడు ఫ్లైట్ టికెట్ తియ్యాలా? అంటూ అడిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్న సూత్రం అలవర్చుకున్నారు అప్పలనాయుడు. అందుకే సామాన్యుల్లో సామాన్యుడిగా.. మెలుగుతూ వస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్నపాటి టిఫిన్ హోటల్ కు వెళ్లారు. పొగ పొయ్యి పై టిఫిన్ తయారు చేస్తున్న మహిళ సాక్షాత్ ఎంపీ రావడంతో ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. కానీ అవేం వద్దని వారించారు ఎంపీ అప్పలనాయుడు. అందరి మాదిరిగానే చిన్నపాటి అరుగుపై కూర్చుని టిఫిన్ చేశారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి చేతిలో కొంత మొత్తం డబ్బు పెట్టారు. అయితే ఓ ఎంపీ సింప్లిసిటీని అక్కడున్నవారు గుర్తించి అభినందించారు. అయితే ఇక్కడే కాదు.. ప్రతిచోట అప్పలనాయుడు ఇదే మాదిరిగా అందరి అభిమానాన్ని చురగొంటున్నారు.