Rushikonda Palace Usage: పాలకుడి అనాలోచిత నిర్ణయం ప్రజలకు శాపమే. ప్రజలు చాన్స్ ఇచ్చారు కాబట్టి ఎలాగోలా పాలన సాగిస్తాను అంటే కుదరదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) చక్కటి ఉదాహరణ. ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. సవ్యంగా పాలించాల్సింది పోయి.. ఉన్న వాటిని ధ్వంసం చేసి కొత్త వాటి గురించి ఆలోచన చేశారు. ఆ ఆలోచన కూడా సవ్యంగా లేదు. ఇప్పుడు రుషికొండ భవనాల విషయంలో అదే జరుగుతోంది. ఎంతో సవ్యంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేసి భారీ భవంతులను కట్టారు. అవి ఎందుకు కట్టామో అధికార ప్రకటన చేయలేదు. మనసులో ఒకటి ఉండి చేస్తే… మరోలా చెప్పించారు ఆ భవనాలపై. ఇప్పుడు వాటిని ఎలా వినియోగించుకోవాలో కూడా కూటమి ప్రభుత్వానికి తెలియడం లేదు. మల్ల గుల్లాలు పడుతోంది ప్రభుత్వం.
వైసిపి వచ్చి ఉంటే..
ఒకవేళ వైసీపీ( YSR Congress party ) అధికారంలోకి వచ్చి ఉంటే ఆ భవనాలపై ఒక క్లారిటీ వచ్చి ఉండేది. ఎందుకంటే ఖచ్చితమైన ఆలోచనతోనే వాటిని నిర్మించారు. కేవలం కుటుంబాలు నివాసం ఉన్నట్టు వాటిని నిర్మించగలిగారు. పర్యాటక ప్రాంతానికి సంబంధించిన ఒక్క ఆనవాళ్లు అక్కడ మిగిల్చలేదు. అక్కడి నిర్మాణాలు కూడా అలానే ఉన్నాయి. పార్కింగ్ సదుపాయం లేదు. గంటలు, రోజులు తరబడి అక్కడ ఉండేందుకు అవసరమైనట్టు వసతులు లేవు. ఒక కుటుంబం శాశ్వతంగా ఉండేందుకు అన్నట్టు అక్కడ నిర్మాణాలు ఉన్నాయి. కచ్చితంగా అక్కడ కార్యాలయాలో, పర్యాటక అవసరాలు తీర్చేలా నిర్మాణాలు లేవు. అలా ఇప్పుడు తీర్చిదిద్దాలంటే అదనంగా చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ భవనాల వినియోగం విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏ ఆలోచన తట్టడం లేదు.
అధ్యయనానికి మంత్రుల కమిటీ..
రుషికొండ( rushikonda) భవనాల వినియోగం విషయంలో ఏం చేయాలి అనేదానిపై మంత్రుల కమిటీని నియమించింది ప్రభుత్వం. అయితే ఆతిథ్య రంగంలో వినియోగించుకుందాం అని చూస్తే.. ఎంతవరకు చేర్పులు మార్పులు చేస్తే గాని పనికిరావు అంటూ చైనా నిపుణులు తేల్చేశారు. చేర్పులు మార్పులు చేస్తామంటే విలువైన నిర్మాణాలను మళ్లీ పడగొట్టాలి. కమోడిటీస్, ఇతర ఇంటీరియర్స్ కు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు హోటళ్లు గా వాటిని నిర్మించాలంటే ముందుగా గదులు ఏర్పాటు చేయాలి. బయట నిర్మాణ ఆనవాళ్లను మార్చాలి. అలాగని మార్చుకుంటే వేరే పనులకు వినియోగించుకోలేరు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అందుకే ఎలా చూసుకున్నా రుషికొండ భవనాలు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా మారాయి.