Vizag Railway Zone: ఏపీ ( Andhra Pradesh)విషయంలో కేంద్రం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఈరోజు రైల్వే జోన్ అంశంపై గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ కొత్త జోన్ ఏర్పాటు కోసం చురుగ్గా చర్యలు చేపడుతోంది. ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఇప్పటికే ప్రధాని మోదీ చేతుల మీద శంకుస్థాపన కూడా జరిగింది. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పరిధిని కూడా నిర్ణయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ గా పేరు మారుస్తూ నిర్ణయం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. అయితే గతంలో ఉన్న విశాఖ డివిజన్ పరిధి మార్చుతూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర రైల్వే శాఖ. దీని ప్రకారం సౌత్ కొస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లో రానున్నాయి. అలాగే విశాఖ డివిజన్లో 410 కిలోమీటర్ల పరిధిని కూడా చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది రైల్వే శాఖ. అలాగే కొండపల్లి- మోటుమర్రి సెక్షన్ ను సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్కు మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ మరో నిర్ణయం తీసుకుంది.
* ఈస్ట్ కోస్ట్ రైల్వే అభ్యంతరం
అలాగే ఒడిస్సాకు సంబంధించి రాయగడ రైల్వే డివిజన్( Rayagada Railway Division) పరిధిలో కూడా మార్పులు చేసింది. వాస్తవానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి తొలుత వాల్తేర్ డివిజన్ కలిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అంగీకరించలేదు. అందుకే కొత్త రైల్వే జోన్ అనేది ఆలస్యం అయింది. ఇప్పుడు రైల్వే శాఖ నిర్ణయంతో పనులు వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో విశాఖలో ప్రధాని మోదీ పర్యటించారు. రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వాల్తేరు డివిజన్ పై నిర్ణయం తీసుకోవడంతో పనులకు మరింత మార్గం సుగమం అయింది.
* రైల్వే జోన్ తో లాభం అదే విశాఖ( Visakhapatnam) కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ ను దక్షిణ మధ్య రైల్వే లో కలపాలన్న డిమాండ్ ఉండేది. అయితే ఒడిస్సా లోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో విశాఖ డివిజన్ ఉండేది. కానీ ఒడిస్సా పరిధిలో ఉండడంతో విశాఖకు అంత ప్రాధాన్యత దక్కలేదు. రైళ్లలోని సీట్ల కోట తగ్గిపోవడం, ప్రతి రైలు భువనేశ్వర్ లో బయలుదేరడం, ప్రతి రైలును భువనేశ్వర్ వరకు పొడిగించడం వంటి వాటితో ఉత్తరాంధ్ర ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అటు మిగతా ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర రైలు నడపాలంటే భువనేశ్వర్ నుంచి అనుమతులు రావాల్సి వచ్చేది. అందుకే దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఎట్టకేలకు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర రైల్వే శాఖ.
* దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి..
మరోవైపు విశాఖ( Visakhapatnam) కేంద్రంగా కొత్త జోన్ అందుబాటులోకి రానుంది. ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఏపీ ప్రజల చిరకాల వాంఛ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే జోన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా నామకరణం చేశారు. విశాఖ కేంద్రంగా ఉండే ఈ రైల్వే జోన్ లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లో చేర్చారు. ఇప్పటికే వాల్తేరు డివిజన్ సైతం దక్షిణ మధ్య రైల్వే లో విలీనం కావడంతో.. అది కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ఇకపై హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లకు మాత్రమే పరిమితం కానుంది.