Vizag Ayodhya Temple Set: దేవుడు పేరుతో దందాకు తెర తీశారా? కోట్లాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందా? రాముడి( Lord Sri Rama ) పేరుతో వసూళ్ల పర్వం మొదలు పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖ బీచ్ రోడ్ లో.. ప్రయాగ్ లోని రామాలయం తరహాలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టిక్కెట్ల నుంచి స్టాళ్ల నిర్వాహణ వరకు భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కొంతమంది బీజేపీ నేతల హస్తం ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలతో స్పందించిన భద్రాచలం రాములోరి దేవస్థానం అధికారులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కక్కలేక మింగలేక ఈ అంశంతో బిజెపి నేతలు డిఫెన్స్ లో పడినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కూటమి షాకింగ్ డెసిషన్!
మూడు నెలల కిందట ఏర్పాటు..
మూడు నెలల కిందట విశాఖ బీచ్ రోడ్ లో ( Visakha Beach Road ) ప్రయాగ్ శ్రీరాముల వారి దేవస్థానం మాదిరిగా భారీ నమూనాను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక స్టాళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. అయితే భద్రాచలం దేవస్థానం పేరిట జంటలతో కల్యాణోత్సవాలు జరిపిస్తామని చెప్పి.. రూ.2999 చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. వేలాది మంది నుంచి ఇలా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం భద్రాచలం దేవస్థానం వరకు వెళ్ళింది. దీంతో దేవస్థానం అధికారులు విశాఖ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
టెంపుల్ టూరిజం లో భాగంగా..
వాస్తవానికి ఇక్కడ ఆలయ నమూనా నిర్వాహకులకు ఉత్తరప్రదేశ్( Uttar Pradesh) ప్రభుత్వం సైతం భారీగా నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రయాగ్ శ్రీరామ ఆలయానికి ప్రచారం కల్పించే వీలుగా.. టెంపుల్ టూరిజం లో భాగంగా నిధులు సమకూర్చినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిస్సాలో సైతం ఒక నమూనాను ఏర్పాటు చేశారు. త్వరలో హైదరాబాదులో సైతం ఓ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసురత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆలయంలో ఎక్కడా పూజలు కనిపించవు. కేవలం ఒక తరహా ప్రచారంతోనే కోట్లు పోగు చేసుకోవాలన్న ధనార్జన ఆలోచన కనిపిస్తోంది. టెంపుల్ టూరిజం లో భాగంగా ప్రయాగ్ శ్రీరామ ఆలయానికి ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయంలో కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇక్కడ స్వామివారి పూజల్లో, స్టాల్స్ నిర్వహణలో బ్రాహ్మణులు ఉండాలి. కానీ ఆ నిబంధనను కూడా పక్కన పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.
Also Read: చంద్రబాబు ఆపడు.. ట్రోలర్స్ వదలరు..
భారీగా విరాళాలు..
అయితే ఈ నమూనా ఆలయం ఏర్పాటుకు సైతం భారీగా విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు( North Andhra ) చెందిన బిజెపి ఎంపీ ఒకరు భారీగా విరాళం ఇచ్చినట్లు సమాచారం. అలాగే కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే శ్రీరాముడి పేరు చెప్పుకొని ఈ దందా పాల్పడడం వెనుక కొందరు బిజెపి నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. భద్రాచలం దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ నమూనా ఆలయ నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు కొందరు బిజెపి నేతలు ఎంట్రీ ఇచ్చి.. నిర్వాహకులతో మాట్లాడించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపి వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తుండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది ఈ అంశం.