Vivekananda Reddy Case Trial: 24 గంటల్లో కేసును ఛేదించాం. నిందితులను పట్టుకున్నాం. ఇది పోలీసుల నుంచి వినిపించే మాట. అయితే నేరాలు మారాయి. నేరాల తీవ్రత మారింది. పోలీసుల విచారణ స్టైల్ మారింది. క్షణాల్లో నిందితులను పట్టుకునే అనేక రకాల సాధనాలు, పరికరాలు వచ్చాయి. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తేగలుగుతున్నారు. కానీ ఎంతటి పరిజ్ఞానం ఓ కేసులో మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సంవత్సరాలు అయినా నిందితులను తేల్చకపోవడం అనేది వ్యవస్థకు మాయని మచ్చ.
* కీలక వ్యక్తి చనిపోతే
ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. అటువంటి వ్యక్తి హత్య జరిగి ఏడు సంవత్సరాలు దాటుతోంది. కానీ ఇంతవరకు నిందితులను గుర్తించడం, దోషులను శిక్షించడంలో మన వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. మా నాన్న హత్యను చేసింది వైసీపీ నేతలే అని స్వయంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపణలు చేస్తున్నా.. న్యాయ పోరాటానికి దిగినా ఇంతవరకు దోషులను పట్టుకోలేకపోయారు. అయితే ఇందులో న్యాయం ఎవరి వైపు ఉన్నా.. ఆ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ అధికారం అవినాష్ రెడ్డిని గట్టున పడేసింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా కేసు ఒక్క ముందడుగు వేయలేకపోతోంది.
* బిజెపి వెనుకేసుకొస్తోందా?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముందుకు కదలక పోవడానికి ప్రధాన కారణం కేంద్రంలోని బిజెపి అని ఒక ప్రచారం అయితే ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి ఉంది. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఈ రెండు పార్టీలకు బలమైన స్నేహితుడిగా పవన్ ఉన్నారు. అయినా సరే వైసీపీతో తెరచాటు స్నేహాన్ని బిజెపి కొనసాగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దానికి అసలు సిసలు ఉదాహరణ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయి హత్య జరిగి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేసు ఒక దరికి చేరలేదంటే కేంద్ర సాయం లేకుండా ఇది సాధ్యమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న ఓ కుటుంబం వివేకా హత్యకు న్యాయం కావాలి అంటూ రోదిస్తున్న పట్టించుకునే వారు లేరు.
* మరోసారి నోటీసులు..
అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముందుకు సాగకపోవడం వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. కచ్చితంగా రాజకీయ కోణంతోనే ఈ కేసుల విచారణలో తాత్సారం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. గతంలో సిబిఐ అధికారి చురుగ్గా వ్యవహరించారు. కానీ ఆయన పైనే ఆరోపణలు చేసి సాగనంపారు. చివరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో కుమార్తె, అల్లుడు పాత్ర ఉందని కట్టుకథలు అల్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చాలా రకాల ఉదంతాలు నడిచాయి. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. వ్యతిరేక పార్టీలు కేంద్రంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు కేసు ముందుకు సాగడం లేదు? కనీస స్థాయిలో విచారణ ఎందుకు జరగడం లేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అయితే ఇటీవల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈ కేసు విచారణ పూర్తి కాలేదని.. ఇందులో తెలుసుకోవాల్సిన అసలు వాస్తవాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరి, కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఉమా శంకర్ తదితరులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేసు విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుంది అట. కనీసం ఈసారైనా వివేకాపై పడిన గొడ్డలి వేటు ఎవరిదా? అని తేల్చకపోతే మాత్రం వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం పోతుంది.