Visakhapatnam To Raipur: కేంద్రం ఏపీకి ( Andhra Pradesh)ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. కీలక ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. ముఖ్యంగా రైల్వే తో పాటు జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను ఏపీకి కేటాయిస్తోంది కేంద్రం. భవిష్యత్తులో అమెరికా తరహాలో ఏపీ రోడ్లు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ రాయ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనులు వేగవంతం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ 2022 నవంబరులో ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 464 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారిని 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వివిధ కారణాలతో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువు పొడిగించారు. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
* మూడేళ్ల కిందట పనులు ప్రారంభం..
మూడేళ్ల కిందట ఈ హైవే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్యాకేజీ 4 కింద విజయనగరం జిల్లా( Vijayanagaram district) కంటకాపల్లి, విశాఖ జిల్లా సబ్బవరం మధ్య 19.562 కిలోమీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయి. అయితే ఓ రెండు కిలోమీటర్లు మినహా రోడ్డు పనులు తుది దశకు వచ్చాయి. రూ.638 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఉత్తరావల్లి కంటకాపల్లి మధ్య రెండు కిలోమీటర్ల హైవే పనులు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. అయితే ఇక్కడ పరిహారం సమస్య ఉంది. నిర్వాసితులు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిధిలో ఉండడం వల్లే ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. ఇంకోవైపు విశాఖ అరకు నేషనల్ హైవే పక్కన గాంధీనగర్ దగ్గర లింక్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అలాగే కొత్తవలస కిరుండాల్ రైల్వే లైన్ పై ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా జరుగుతోంది.
* పనులకు ఆటంకం..
ఇదే మార్గంలో గులివిందాడ, కొండ డాబాలు ప్రాంతంలో నేషనల్ హైవే పనులు నిలిచిపోయాయి. అక్కడ టోల్ ప్లాజా( toll plaza) నిర్మాణం వల్ల పనులకు ఆటంకం కలిగింది. సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. అయితే విద్యుత్ లైన్ల మార్పు, భూ సేకరణ సమస్యల వల్ల ఆగినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. గులివిందాడ దగ్గర్లో 400 కె.వి విద్యుత్ లైన్ మార్చాల్సి ఉండగా.. దీనికి అనుమతులు రావడంతో త్వరలో పనులు మొదలు పెడతామంటున్నారు అధికారులు. బ్రిడ్జి కోసం హైవేకు ఇరువైపులా స్తంభాలు వేశారు. అయితే అక్కడ 400 కే.వి విద్యుత్ లైన్ ను మార్చాల్సి ఉంది.
* మధ్యలో రెండు జిల్లాల మీదుగా..
విశాఖ ( Visakhapatnam)నుంచి రాయపూర్ వరకు నిర్మిస్తున్న ఈ రహదారి.. మధ్యలో విజయనగరం, పార్వతీపురం మన్యం మీదుగా వెళుతుంది. మధ్యలో ఒడిస్సా కూడా ఉంటుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ వెళ్లేందుకు ప్రయాణించే సమయం తగ్గుతుంది. 12 గంటల్లో కాకుండా ఆరు గంటల్లోనే వెళ్లొచ్చు. విశాఖ నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, వనరులు తరలించేందుకు ఎంతగానో దోహదపడనుంది.