Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో టార్గెట్లు ఇచ్చింది యాజమాన్యం. చెప్పిన పనికి, ఆదేశించిన లక్ష్యానికి మేరకు జీతాల చెల్లింపు ఉంటుందని తేల్చి చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ సంస్థల ఫార్ములాను తెరపైకి తెచ్చింది. దీనిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ప్రైవేటీకరణకు ఉద్దేశించిన నిర్ణయమని తప్పుపడుతున్నాయి. అయితే అందులో తప్పేముందని.. ఉత్పత్తి పెరగాలంటే ప్రతి ఉద్యోగి పని చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు అయింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. ఇప్పుడు ఉత్పత్తి పెంపునకు సంబంధించి లక్ష్యాలు విధించడం సైతం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇది కంపెనీ వృద్ధి కోసమేనని.. స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితిని అధిగమించేందుకేనని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అనేక ప్రయోగాలు చేసింది యాజమాన్యం. అయితే ఉత్పత్తి పెరగకపోవడానికి మానవ తప్పిదాలు ఉన్నాయని భావించి ఈ లక్ష్యాలను విధించినట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే గుర్తింపు..
ప్రపంచంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా గుర్తింపు ఉంది.. ఇక్కడ స్టీల్ నాణ్యమైనదిగా గుర్తించి ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. అమ్మకాలకు తగ్గట్టు ఇక్కడ ఉత్పత్తి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిన ఉత్పత్తి పెరగడం లేదు. ఎన్నో రకాల ఉత్పత్తి ప్రయోగాలు చేస్తున్న ఫలితం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఉత్పత్తి పెంపుదలకు సంబంధించి లక్ష్యాలను విధించింది. అయితే దీనిని వ్యతిరేకిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచన వేరేలా ఉంది.
గనులు కేటాయించాలంటున్న ఉద్యోగులు
కేంద్రంలో మోదీ( Prime Minister Narendra Modi) నేతృత్వంలోని బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. దేశంలో ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు గనుల కేటాయింపు జరుగుతోంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు జరగకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన వేరేలా ఉంది. సమయానుకూలంగా స్టీల్ ఉత్పత్తులు ఇవ్వలేకపోతున్నామని.. ఇప్పుడు పని చేస్తున్న వారిలో కాంట్రాక్టు సిబ్బంది మాత్రమే మెరుగైన సేవలందిస్తున్నారని.. శాశ్వత ఉద్యోగులు సక్రమంగా పనిచేయడం లేదని.. వారు పనిచేస్తే ఉత్పత్తి ఎక్కడికో వెళ్లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే పనిచేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకోవాలని ఉద్యోగులకు సూచిస్తుంది. అయితే సొంత గనులు లేకుండా అభివృద్ధి ఎలా అని కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నిస్తుండగా.. ఉన్న వనరులతోనే ఉత్పత్తి అందించలేకపోతున్నారని.. కనులు కేటాయిస్తే ఏం చేస్తారులే అన్నట్టు మాట్లాడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఎప్పుడు వార్తల్లో నిలిచేదే..!