Visakhapatnam Railway Division Changes 2026: రైల్వే శాఖ( railway department) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వే జోన్ పరిధిలో మార్పులు చేసింది. గత కొంతకాలంగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా పలాస- ఇచ్చాపురం మధ్య ఏడూ రైల్వే స్టేషన్లను విశాఖ రైల్వే జోన్ లో చేర్చింది. కొత్తగా ఏర్పడిన విశాఖ డివిజన్లో సైతం కలిపింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇచ్చాపురం నుంచి పలాస మధ్య ఉన్న 7 రైల్వే స్టేషన్లు ఇకనుంచి సౌత్ కొస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి రానున్నాయి.. మొన్ననే విశాఖ రైల్వే జోన్ తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఉన్న చాలా స్టేషనులను విశాఖ జోన్ లో చేర్చింది. కానీ పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉంచేసింది.
* అప్పట్లో దక్కని చోటు…
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వచ్చాయి. కానీ పలాస, మందస రోడ్డు, బారువా రోడ్డు, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లు మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. ఖుర్ధా డివిజన్లోనే ఉంచుతూ.. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోనే కొనసాగిస్తూ ఉంచడంపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జిల్లాలో మిగతా ప్రాంతాలు కొత్త జోన్ లోకి వచ్చి.. తమ ప్రాంతంలో రైల్వేస్టేషన్లో మాత్రం ఒడిస్సా పరిధిలో ఉండడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
* కార్యాలయ భవన నిర్మాణ పనులు..
మరోవైపు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే శాశ్వత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఓ ప్రైవేటు భవనంలో కార్యాలయానికి సంబంధించి కార్యకలాపాలు మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది రైల్వే శాఖ. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను నాలుగు డివిజన్ల తో ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖ డివిజన్లుగా విభజించారు. ఎప్పటినుంచో ఉన్న వాల్తేరు డివిజన్ ను రెండుగా విభజించారు. ఒక భాగాన్ని విశాఖ డివిజన్ గా చేశారు. మరో భాగాన్ని ఒడిస్సాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోకి శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రైల్వే స్టేషన్లను చేర్చడంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
