Visakhapatnam Investor Summit: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పై ఒక విమర్శ ఉంది. సంక్షేమ పథకాలను నమ్ముకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్న ఆరోపణ ఆయనపై ఉంది. అన్నింటికీ మించి పారిశ్రామికంగా అభివృద్ధి పై దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కొత్త పరిశ్రమలను తేకపోగా.. ఉన్న పరిశ్రమలను తరలిపోయేలా చేశారన్న విమర్శను మూటగట్టుకున్నారు. వైసీపీ నేతల రాజకీయాలు పుణ్యమా అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడ్డారన్న విమర్శ ప్రధానంగా వినిపించేది. దానికి సంబంధించిన అంశాలు ఎన్నికల్లో హైలెట్ అయ్యాయి. ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. ప్రజలు కూడా ఈ విమర్శలను బలంగా నమ్మారు. దాని ఫలితమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం. అయితే జగన్కు ఎదురైన పరిణామాలను ఇప్పుడు చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
* మొదటి ఏడాది అలా..
2024 జూన్లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. మూడు నెలల పాటు ప్రభుత్వ ఆదాయంతో పాటు ఆర్థిక పరిస్థితి పై అధ్యయనం చేశారు. శాఖలను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధానితో( Amravati capital ) పాటు పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వాటికి నిధులు సమీకరించగలిగారు. సరిగ్గా ఏడాది తరువాత సంక్షేమ పథకాల అమలును ప్రారంభించారు. అలా ప్రజల్లో సంతృప్తి వస్తున్న క్రమంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు. కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలిశారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం తరఫున రాయితీలు కూడా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు చర్యలు తటస్తులపై విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి.
* పారిశ్రామిక అభివృద్ధితోనే ఆదాయం..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. లక్షలాది ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రయత్నాలు ఏవి జరగలేదు. పైగా అమర్ రాజా వంటి పరిశ్రమలు తెలంగాణ వైపు వెళ్లిపోయాయి. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే అవి పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒకవైపు వైసీపీ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్న విమర్శ ఉండగా.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడంతో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేక భావన వచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి సన్నాహాలు చేయలేదు. అటువంటి ప్రయత్నాలు ఏవి చేయలేదు. అయితే ప్రజల్లో ఈ అసంతృప్తిని గమనించారు చంద్రబాబు. ఒకవైపు పాలన.. మరోవైపు అభివృద్ధి.. ఇంకోవైపు సంక్షేమం.. ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటు పై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రజల్లో చంద్రబాబు చర్యలపై సంతృప్తి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గుర్తించలేని అంశాన్ని చంద్రబాబు గుర్తించి మరి ప్రజల్లోకి వెళ్తున్నారు.
* ప్రభుత్వం పట్ల సానుకూలత..
విశాఖ పెట్టుబడుల సదస్సు అనేది ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆహ్వానించాలన్నది ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ముందు జరిగిన సదస్సులకు భిన్నంగా ఈ సదస్సు జరగనుంది. కచ్చితంగా పెట్టుబడులు పెడతామన్నవారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా వారికి ఇచ్చే రాయితీలకు సంతృప్తి పడి ఇక్కడ పెట్టుబడి పెట్టనున్నారు. ఈ సదస్సులో నేరుగా ఒప్పందాలు చేసుకొని.. కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. మొత్తానికి అయితే జగన్ సద్వినియోగం చేసుకోలేనిది.. చంద్రబాబు బాగానే వినియోగించుకుంటున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.