CM Chandrababu: ఎందరో త్యాగధనుల పోరాటఫలం విశాఖ ఉక్కు. వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది ఈ పరిశ్రమ. కానీ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. దీంతో ఉద్యమం రగిలింది. అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిచిపోతుందని అంతా ఆశించారు. కానీ చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పిందని.. కేంద్రం పావులు కదుపుతోందని మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేగింది. గత కొద్ది రోజులుగా ఇదే వైరల్ అంశంగా మారింది. రాజకీయ అంశంగా మారి.. అధికార విపక్షాల మధ్య ప్రచార అస్త్రంగా మారిపోయింది.
వైసిపి ప్రభుత్వ హయాంలో.. విశాఖలో ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెను దుమారం రేగింది. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే కేంద్రం ఈ దుశ్చర్యకు దిగిందని అప్పటి విపక్షాలు టిడిపి, జనసేనలు ఆరోపించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమాలకు సంఘీభావం తెలిపాయి. దీంతో అప్పటి అధికారపక్షం వైసీపీ సైతం మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ప్రైవేటీకరణ చేయొద్దని అప్పటి సీఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ అవేవీ కేంద్ర ప్రయత్నాలను అడ్డుకోలేకపోయాయి. అయితే కూటమి సర్కార్ రావడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బ్రేకులు పడతాయని అంతా భావించారు. కానీ ఇంతలోనే పెను దుమారం రేగింది. డెక్కన్ క్రానికల్ పత్రికలో దీనికి సంబంధించి వచ్చిన వార్త కలకలం సృష్టించింది. సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఓకే చెప్పారు అన్నది ఈ వార్త సారాంశం.
ఒకవైపు విశాఖ ఉక్కు వివాదం రగులుతుండగా సీఎం చంద్రబాబు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ జిల్లాలో పర్యటించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రచారాన్ని ఖండించారు. కొందరు దొంగలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ వ్యాఖ్యానించారు. అటు మంత్రి కుమారస్వామి సైతం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రతిపాదన మాత్రమే ఉందని కామెంట్స్ చేశారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించి విషయాలు తెలుసుకున్న మీదట.. దీనిని ప్రైవేటీకరించకుండా ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ పరిణామాలు ప్రధాని మోడీకి వివరిస్తానని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు ఊపిరి పోసినట్లు అయ్యింది. మున్ముందు దీనిపై బలమైన ప్రకటన వచ్చేలా మంత్రి కుమారస్వామి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు జగన్. అయినా ప్రజలు ఆహ్వానించలేదు. వైసీపీని ఆదరించలేదు. అయితే అన్నింటికీ మించి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం జగన్ కు రాజకీయంగా చాలా ఇబ్బంది తెచ్చి పెట్టింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో జీవీఎంసీ కి ఎన్నికలు జరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా స్టీల్ కార్మికులు, ఆ ప్రాంత ప్రజలు వైసీపీని తిరస్కరించారు. సాధారణ ఎన్నికల్లో సైతం విశాఖ స్టీల్ అంశం ఉత్తరాంధ్ర పై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ పై కేంద్రం ముందుకెళ్తే కూటమి పార్టీలకు సైతం ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే కేంద్రంలో కీలక భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ హయాంలో ప్రైవేటీకరణ జరగకూడదని భావిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ప్రతిపాదన ఉండడంతో.. ఏనాటికైనా కేంద్రం దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Visakha steel plant will not be privatized cm chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com