Vishaka Steelplant Issue: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మరోసారి పైకి వచ్చింది. గత కొద్దిరోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రగులుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల వివాదం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే తాజాగా ప్లాంట్లు కొన్ని రోజులుగా ముడి సరుకు కొరత రావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్ మూసివేత పన్నాగం పన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కార్మిక వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వారంతా నిరసన బాట పట్టారు. ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. దీంతో విశాఖ ఎంపీ శ్రీ భరత్ తో పాటు గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించాల్సి వచ్చింది. కార్మికులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకు దొరికేలా చేయడంతో పాటు ప్రైవేటీకరణను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టిడిపి నేతలు కార్మికుల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపి శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులను కలిసి తాము చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కేంద్రంతో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని ఎంపీ శ్రీ భరత్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే పదవికి రాజీనామా చేసి నిరసన శిబిరంలో కూర్చుంటానని పళ్ళ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
* అప్పట్లో వైసీపీ టార్గెట్
గత ఐదేళ్ల కాలంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండగా.. రాష్ట్రంలోవైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండేది.ఆ సమయంలో ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. బిజెపితో వైసిపి స్నేహంగా ఉండడంతో ఆ పార్టీ టార్గెట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా టిడిపి కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో స్టీల్ ప్లాంట్ అంశంలోఆ పార్టీ కార్నర్ అవుతోంది. గతంలో వైసీపీపై టిడిపి ఏ విధంగా ఆరోపణలు చేసిందో.. ఇప్పుడు అదే విధంగా టిడిపిఫై వైసిపి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రకరకాల డిమాండ్లను తెరపైకి తెస్తోంది.
* కార్మికుల కొత్త డిమాండ్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లాలని వారు సూచిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
* జాగ్రత్త పడిన టిడిపి
స్టీల్ ప్లాంట్ అంశం టిడిపి మెడకు చుట్టుకునేలా ఉంది. అందుకే ఆ పార్టీ జాగ్రత్త పడింది. ఈ విషయంలో తమ తప్పు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విశాఖ ఎంపీ శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్వయంగా కార్మికుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. మొత్తానికైతే నాడు వైసిపి, నేడు టిడిపి విశాఖ స్టీల్ అంశంలో కార్నర్ కావడం విశేషం.