Jagan Narsipatnam Tour: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పర్యటనకు అనుమతి ఇచ్చారు విశాఖ పోలీసులు. ఈ నెల 9న జగన్ నర్సీపట్నం పర్యటనకు సంబంధించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు విశాఖ వైసిపి నేతలు. అయితే తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఘటన దృష్ట్యా రోడ్డు షోకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు మహిళా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న దృష్ట్యా భద్రత కల్పించలేమని కూడా చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాయి. దీనిపై తీవ్ర తర్జనభర్జన జరుగుతున్న నేపథ్యంలో.. విశాఖ పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు.
రోడ్ షో కు అనుమతి నిరాకరణ..
రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు( government medical colleges ) వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మంజూరు అయ్యాయి. ఇందులో ఓ ఐదు కాలేజీల నిర్మాణం కొలిక్కి వచ్చింది. మిగతా వాటి నిర్మాణానికి సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని తప్పుపడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. చివరకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. నేరుగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే విశాఖ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చి.. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో నర్సీపట్నం వెళ్లేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే జగన్ పర్యటనకు సంబంధించి అనుమతి ఇవ్వాలని విశాఖ జిల్లా వైసీపీ నేతలు పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డు షోకు అనుమతి ఇవ్వమని.. హెలికాప్టర్లో వెళ్లేందుకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు, నిలదీతలు ఎదురుకావడంతో.. పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
జన సమీకరణకు నో పర్మిషన్..
తాజాగా పోలీసులు ఇచ్చిన అనుమతి రూటు ప్రకారం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు( Visakha airport ) చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా.. అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మాకవరం పాలెం కు అనుమతి ఇచ్చారు. ట్రాఫిక్ రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలతో పాటు సమావేశాలకు అనుమతి లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కాన్వాయ్ లో పది వాహనాలకు మించి ఉండకూడదని కూడా తేల్చి చెప్పారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేస్తామని.. కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.