Diviseema Uppena: దివిసీమ ఉప్పెన.. చరిత్ర పుటల్లో నిలిచింది ఈ పెను విపత్తు. రాకాసి అలల తాకిడికి ఊళ్ళకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం ఇది. నేటితో ఈ విపత్తుకు 46 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న సముద్రుడు రక్త చరిత్ర రాశాడు. ఆ కాలరాత్రికి నాలుగున్నర దశాబ్దాలు దాటుతున్నా.. ఇంకా మాయని గాయంగానే ఉంది.
ఈ దేశంలో ఎన్నో రకాల విపత్తులు వచ్చాయి. భారీ వర్షాలు, వరదలు, సునామీలు, భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. కానీ అందులో దివిసీమ ఉప్పెన కనీవినీ ఎరుగని నష్టాన్ని చేకూర్చింది. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు.. ఎంతటి వారైనా కన్నీరు పెడతారు. సముద్రం మృత్యువుల మారి కాటేస్తే.. ఉప్పెన రూపంలో ముంచుకొస్తే ఎలా ఉంటుందో బాధితులు కల్లారా చూశారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే ఇందులో కొందరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. తెల్లారే వరకు బతికుంటే చాలు అన్న రీతిలో ప్రజలు బ్రతికారంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
దివిసీమ ఉప్పెనలో పదివేల మంది మృత్యువాత పడినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ అనధికారికంగా అంతకుమించి జనం మృతి చెంది ఉంటారని ఇప్పటికీ స్థానికులు చెబుతుంటారు. సముద్రం ఉప్పొంగి ఊర్ల మీద పడితే, తాటి చెట్టు ఎత్తులు రాకాసి అలలతో ముంచేస్తే.. ఎంత నష్టం జరిగి ఉంటుందో అంచనా కూడా అందదు. అటువంటిదే దివిసీమలో ఎదురైంది. ఒక్క మనుషులే కాదు.. వేలాది మూగజీవాల సైతం మృత్యువాత పడ్డాయి.
దివిసీమ ఉప్పెన దాడికి సొర్లగొంది, మూల పాలెం, దిండి, సంగమేశ్వరం, నాలి తదితర మత్స్యకార గ్రామాలు కొట్టుకుపోయాయి. శవాలు గుట్టలు గుట్టలుగా మిగిలాయి. దాదాపు ఈ గ్రామ ప్రజలంతా మృత్యువాత పడ్డారు. ఉప్పెనకు నెల రోజులు వరకు మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నాటి కాళరాత్రి ని గుర్తు చేసుకొని ఈ గ్రామాల ప్రజలు ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతుంటారు. నాటి రాకాసి అలల ఎత్తుకు ప్రతిబింబంగా ఓ భారీ స్తూపాన్ని కట్టించారు. అప్పట్లో సహాయ చర్యలు చేపట్టిన పోలీసుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు. ఏటా నవంబర్ 19 వచ్చిందంటే ఈ గ్రామాల ప్రజల మౌనరో ధన అంతా ఇంతా కాదు. జనం రాత్రంతా జాగారం చేస్తుంటారు. పూర్వీకుల గురుతులను నెమరు వేసుకుంటారు. వారికి ఘనంగా అంజలి ఘటిస్తుంటారు.