Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిబిఐ( CBI) షాక్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నెల రోజులపాటు నార్వే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. అయితే దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు తీర్పు ను రిజర్వ్ చేసింది. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన సందిగ్ధంలో పడింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఇదే కేసులో ఏ 1 గా ఉన్న మాజీ సీఎం జగన్ కు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తప్పకుండా కోర్టు అనుమతి ఇస్తుందని విజయసాయిరెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
* గత కొద్దిరోజులుగా ఊహించని పరిణామాలు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) కొద్దిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆయన వదులుకున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే.. తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పుకొచ్చారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయంగా పేర్కొన్నారు. వ్యవసాయం కూడా చేసుకుంటానని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం, స్వయంగా వివరణ ఇవ్వడంతో రాజ్యసభ చైర్మన్ రాజీనామాను ఆమోదించారు.
* విదేశీ పర్యటనలో జగన్
ఇంకోవైపు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్( Jagan Mohan Reddy) విదేశాల్లో ఉన్నారు. గతంలో ఆయన పర్యటనకు సంబంధించి సిబిఐ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జగన్ పాస్పోర్టునకు సంబంధించి సైతం అడ్డంకులు ఉండేవి. వాటన్నింటినీ క్లియర్ చేస్తూ కోర్టు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఈనెల రెండో వారంలో లండన్ లో తన కుమార్తె డిగ్రీ ప్రదాన కార్యక్రమానికి జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మరి కొద్ది రోజుల్లో తిరిగి ఏపీకి రానున్నారు. ఇంతలోనే తన సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వైసిపి వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. దీనిపై జగన్ ఏపీకి వచ్చిన వెంటనే స్పందించే ఛాన్స్ కనిపిస్తోంది.
* రకరకాలుగా ప్రచారం
అయితే వైసీపీకి( YSR Congress ) రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చుట్టూ అనేక వివాదాలు అల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారని కూడా ప్రచారం నడుస్తోంది. జగన్ ను ఏపీలో దెబ్బ కొట్టాలని.. వైసీపీ నిర్వీర్యం అయితే కానీ ఏపీలో బిజెపి బలపడదన్న కోణంలో.. కేంద్ర పెద్దలు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ఒక విశ్లేషణ ఉంది. ముఖ్యంగా జగన్ ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే నిన్నటికి నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి విదేశీ ప్రయాణానికి సంబంధించి.. ఇంకా అడ్డంకులు తొలగకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈనెల 29న సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఒకవేళ ప్రతికూల తీర్పు ఇస్తే మాత్రం విజయసాయిరెడ్డి హైకోర్టులో సవాల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.