Pawan Kalyan- Vijayasai Reddy: గత ఎన్నికల్లో జనసేనతో కలిసి నడవాలని వైసీపీ ప్రయత్నించిందా? అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడానికి తమ బలం చాలదని అనుమానం పడిందా? అందుకే పవన్ ను కలుపుకోవాలని భావించిందా? అంటే జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు ఈ విషయం బయటకు రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన యాక్టివ్ రోల్ పోషిస్తోంది. ఇటీవల వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాలను జనసేన నాయకులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జనసేన కోసం వైసీపీ నేతలు ఎంతగానో ఆరాటపడ్డారని చెబుతున్నారు. సంచలన నిజాలను ఇప్పుడు బయటపెడుతున్నారు.

అయితే ముఖ్యంగా పవన్ ప్రాపకం కోసం వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా నాలుగు గంటల పాటు వెయిట్ చేశారుట. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ, బీజేపీకి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కూడా పవన్O ఏనాడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. పదవుల కోసం అర్రులు చాచలేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించి నాటి ప్రభుత్వాలతో పని చేయించుకునేవారు. అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అయితే అప్పటికే విపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర చేశారు. పీకే టీమ్ రంగంలోకి దిగి ఏపీలో అనేక రకాల ఎత్తుగడలు వేసింది. చంద్రబాబు సర్కారుపై విష ప్రచారం చేసింది.
అయితే ఇన్నిచేసినా ఎన్నికల్లో అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకం వైసీపీకి కుదరలేదు. అదే సమయంలో పవన్ మరోసారి చంద్రబాబుతో కలిస్తే తమకు కష్టమని కూడా జగన్ భావించారు. అందుకే పవన్ ను ఒకసారి సంప్రదించి మాట్లాడాలని విజయసాయిరెడ్డిని పురమాయించారు. దీంతో రంగంలోకి దిగిన విజయసాయి పవన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అంతకంటే ముందుగా కొంతమంది జనసేన నేతలను విజయసాయిరెడ్డి అప్రోచ్ అయ్యారు. ఈ క్రమంలో పవన్ కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు గంటల పాటు వెయిట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ కూడా పవన్ తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.

అయితే నాటి పరిణామాలను గుర్తుచేస్తూ జనసేన నేతలు మాటలు ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి పవన్ ముందు ఉంచిన అంశాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. నాటి చర్చల్లో భాగంగా విజయసాయిరెడ్డి పవన్ ముందు కొన్ని ప్రతిపాదనలైతే ఉంచారన్న ప్రచారం జరిగింది. కానీ వాటిని పవన్ యాక్సెప్ట్ చేయలేదని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి అంతులేని విజయం దక్కడంతో పవన్ తో జరిగిన చర్చలన్నీ మరుగున పడిపోయాయి. ఇప్పడు జనసేన, వైసీపీ మధ్య మాటల దాడి, యుద్ధ వాతావరణం నెలకొనడంతో నాటి సంగతులను జనసేన నేతలు గుర్తుకు తెస్తూ కౌంటర్ ఇస్తున్నారు.