VijayaSai Reddy : వైసీపీకి( YSR Congress ) విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? కేసుల భయమా? కూటమి ప్రభుత్వం వేధింపులా? లేకుంటే వైసీపీలో ప్రాధాన్యం తగ్గిందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే సాయి రెడ్డి రాజీనామా వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తాడేపల్లి తో పాటు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే పార్టీకి గుడ్ బై చెబుతూ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడుగా మెలిగారు విజయసాయిరెడ్డి. టిటిడి బోర్డు సభ్యుడుగా, ఓబీసీ బ్యాంక్ డైరెక్టర్ గా, అటు తర్వాత సాక్షి సంస్థలను పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. జగన్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. వైసీపీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని పొందారు. 2019 ఎన్నికల్లో గెలుపు, పార్టీ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో బిజెపి, జగన్ మధ్య వారధిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ తో పాటు అమిత్ షా కు సన్నిహితుడుగా మారారు. కానీ 2024 ఓటమి తర్వాత పూర్తిగా సమీకరణలు మారిపోయాయి.
* ఫిర్యాదులతో తొలగింపు
ఈ ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర( North Andhra ) సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ ఆయనపై ఫిర్యాదుల కారణంగా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. కొంతకాలం పాటు విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉండిపోయారు. ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. నెల్లూరు జిల్లా అవసరాల దృష్ట్యా జగన్ ఆయనకు నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించారు. కానీ ఓటమి ఎదురైంది. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని తొలగించి.. వై వి సుబ్బారెడ్డి నియమించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. విజయసాయిరెడ్డిని కేవలం రాజ్యసభ సభ్యుడు గానే ఉంచడంపై ఆయనలో ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభమైంది.
* అప్పటి నుంచి అనుమానం
వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు( beeeda Mastan Rao) , మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు. అయితే వారు వైసిపి తో పాటు రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. అయితే దీని వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారన్నది వైసిపి లో ఉన్న ఒక అనుమానం. అయితే పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో విజయసాయిరెడ్డి లో ఒక రకమైన ఆలోచన ప్రారంభం అయ్యింది. అదే సమయంలో బిజెపి నుంచి కూడా ఒత్తిడి ఎదురైనట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా అత్యంత సన్నిహితులతో ఈ విషయమే ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే వైసీపీని వీడి ఏదో ఒక పార్టీలో చేరడం కంటే.. న్యూట్రల్ గా ఉండిపోవడమే మేలన్న నిర్ణయానికి విజయసాయిరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయం జగన్ వరకు వెళ్లడంతో ఆయన సముదాయించినట్లు పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ రాజకీయాల్లో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* ఇంకా మూడేళ్ల పదవి
వాస్తవానికి 2028 వరకు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) రాజ్యసభ పదవీకాలం ఉంది. వైసిపి ఆవిర్భావం నుంచి తొలి రాజ్యసభ సభ్యత్వం అందుకున్నారు విజయసాయి. అప్పటినుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పినా ఆయన.. ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఆయన నిర్ణయం వెనుక పార్టీపై అసంతృప్తి ప్రధాన కారణమని తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తే.. అందుకు తగ్గ గుర్తింపు రాలేదని ఆయనలో ఆవేదన. పైగా జగన్ తర్వాత కేసులు ఎదుర్కొంటుంది ఎక్కువగా ఆయనే. కానీ ఆ స్థాయిలో పదవులు కానీ.. ఇతరత్రా ప్రయోజనాలు కానీ దక్కడం లేదన్నది ఆయనలో వ్యక్తం అవుతున్న ఆవేదన. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.