Vijayasai Reddy : విజయసాయి రెడ్డి చుట్టూ ఉచ్చు బోగిస్తోందా? ఆయనను కార్నర్ చేస్తున్నారా? అష్టదిగ్బంధనం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు విజయసాయిరెడ్డికి సంబంధించి అనేక అంశాలు బయటపడుతున్నాయి. తాజాగా కాకినాడ పోర్టు లో వాటాదారుడి నుంచి బలవంతంగా వాటాలు రాయించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అయితే విజయసాయి రెడ్డి పై ఇటువంటి ఆరోపణలు ఆరునెలల కాలంలో ఎన్నో బయటపడ్డాయి. తొలుత ఓ మహిళా అధికారి విషయంలో కార్నర్ అయ్యారు విజయసాయిరెడ్డి. అటు తరువాత విశాఖలో భూఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున దందాకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కాకినాడ పోర్టులో వాటాలు రాయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానేనని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కానీ బాధితులు నేరుగా ఫిర్యాదుతోనే ఈ విషయాలు బయటకు వస్తున్నాయి అన్న విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తించలేకపోతున్నారు.
* ఆ మహిళా అధికారి వివాదంలో
దేవాదాయ శాఖకు చెందిన ఓ మహిళ అధికారి కుటుంబ వివాదంలో.. విజయసాయిరెడ్డి పేరు బయటకు వచ్చింది. తన భార్య కడుపులో ఉన్న పిల్లాడికి తండ్రి ఎవరు అంటూ.. ఆ మహిళా అధికారి భర్త ప్రశ్నించేసరికి వివాదం మొదలైంది. ఆయన విజయసాయి రెడ్డి పై సంచలన ఆరోపణలు చేయడంతో స్పందించాల్సి వచ్చింది. అప్పుడు కూడా విజయసాయిరెడ్డి ఇది రాజకీయ కుట్రగా విమర్శించారు. అంతటితో ఆగకుండా మీడియా అధినేతలను తప్పుపడుతూ తిట్ల దండకం అందుకున్నారు.
* విశాఖలో భూదందాపై
విశాఖలో భూదందా ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆయన కుటుంబం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొల్లగొట్టిందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగి వివాదాస్పద కట్టడాలను కూల్చివేసింది. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపాలంటూ అక్కడి ప్రజలే నేరుగా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
* బలవంతంగా వాటాలు రాయించుకుని
ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టులో ఒకప్పటి వాటాదారు కె.వి.రావు స్వయంగా ఫిర్యాదు చేశారు. తనను విజయసాయిరెడ్డి బెదిరించి వాటా రాయించుకున్నారని.. తన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి కి వాటాలు రాయించి ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. సిఐడి కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు విజయసాయిరెడ్డి. కె.వి. రావుతో పాటు చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని చెబుతున్నారు. అయితే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు సాయి రెడ్డి. ఈ కేసులన్నీ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నమోదు చేసినవే. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అడ్డగోలుగా తన వాదనలు వినిపించడమే కాదు ఆరోపణలు చేస్తున్నారు.