Vijayasai Reddy: ఏపీలో( Andhra Pradesh) ఉవ్వెత్తున ఎగసిన చాలామంది నేతలు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన వారంతా వ్యూహాత్మక సైలెంట్ లో ఉన్నారు. మాజీమంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా వంటి నేతలు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. మొన్న ఆ మధ్యన రోజా మధ్య మధ్యలో బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసేవారు. అనిల్ కుమార్ యాదవ్ సైతం నెల్లూరు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టారు. కానీ ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. వారిని అలా విడిచిపెడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి సందడి కూడా లేదు. ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియడం లేదు. కనీసం బహిరంగంగా కూడా కనిపించడం లేదు. మొన్న మధ్యన లిక్కర్ స్కాంలో విచారణకు పిలిచింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే తనకు పని ఉందని.. తరువాత వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. నెలలు గడుస్తున్నా విజయసాయి రెడ్డికి తీరిక దొరకలేదన్నమాట. అదే సమయంలో విజయసాయిరెడ్డిని సీట్ సైతం పట్టించుకోవడం మానేసింది.
* వైసిపి హయాంలో దూకుడు..
రాజకీయాల్లో దూకుడు తనం అంత మంచిది కాదని విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) ద్వారా తెలుసుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎగిరి పడేవారు. సోషల్ మీడియాలో చిన్న పెద్ద తేడా లేకుండా విరుచుకుపడేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టేవారు. చివరకు రామోజీరావును సైతం విడిచి పెట్టేవారు కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను అయితే బూతులు తిట్టేవారు. కానీ అదంతా అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏ పార్టీకి చెందని వ్యక్తిగా మిగిలిపోయారు.
* ప్రస్తుతం సేఫ్ జోన్లో..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల అరెస్టులు జరిగాయి. కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది వ్యక్తులు లోపలికి వెళ్లారు. చివరకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం సుదీర్ఘకాలం జైలులోనే ఉండిపోయారు. ఇంకా సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ లభించడం లేదు. ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జైలు గోడలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా విజయసాయిరెడ్డి అరెస్టు మాత్రం జరగడం లేదు. ఆయన జోలికి వెళ్లడం లేదు. జగన్ శిబిరంలో ఆందోళనకు అదే కారణం. అదే సమయంలో విజయసాయిరెడ్డి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారని అనుమానిస్తున్నారు. ఆయన నుంచి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైసిపిలో మరింత ఆందోళన పెరుగుతోంది.