VijayaSai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. రాజకీయాలనుంచి తప్పుకున్న ఆయన వ్యవసాయం చేసుకుంటానన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. తన క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోమవారం రాత్రి ఆ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆయన వదులుకున్నారు. ఇకనుంచి రాజకీయాల్లో ఉండనని కూడా తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు.
* సామాన్య చార్టెడ్ అకౌంటెంట్
నెల్లూరు ( Nellore) జిల్లాకు చెందిన వేణుంబాక విజయసాయిరెడ్డి సామాన్య కుటుంబం. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆయన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ కుటుంబ వ్యాపారాలకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించేవారు. అటు తరువాత జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన వ్యాపార వ్యవహారాలను చూసేవారు. అయితే 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా రకాల పరిశ్రమలను నిర్వహించేవారు. దీంతో విజయసాయి రెడ్డి ఆ వ్యాపారాలకు తనవంతు సాయం అందించేవారు.
* కొద్ది రోజుల కిందట పార్టీకి దూరం
రాజశేఖర్ రెడ్డి ( Rajasekhar Reddy )అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణంతో మనస్థాపానికి గురై చాలామంది చనిపోయారు. వారిని పరామర్శించేందుకు సిద్ధపడ్డారు జగన్. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం అడ్డుపడింది. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓదార్పు యాత్ర చేపట్టారు జగన్. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైల్లో ఉండి పోయారు. ఆ సమయంలోనే విజయసాయిరెడ్డి సైతం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అప్పటినుంచి మొన్నటి రాజీనామా వరకు జగన్ కు సంబంధించి ప్రతి అంశంలోనూ విజయసాయిరెడ్డి ఉండేవారు. వైసీపీ ఏర్పాటు, జగన్ ను సీఎం చేయడంతో పాటు అనేక అంశాల్లో విజయసాయిరెడ్డి దోహదపడ్డారు. కానీ ఇప్పుడు అనూహ్యకరమైన పరిస్థితుల్లో పార్టీకి దూరమయ్యారు.
* పొలంలో చిత్రాలు
అయితే వ్యవసాయం( cultivation) చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి.. అనుకున్న మాదిరిగానే పొలంలో దిగిపోయారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ప్రాంతం ఎక్కడిది అన్న విషయాన్ని మాత్రం సాయి రెడ్డి చెప్పలేదు. అయితే ఆ ప్రాంగణాన్ని చూస్తే పెద్ద ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేసినట్లు కనిపిస్తోంది. ఎంచక్కా టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ లోకి మారిపోయిన సాయి రెడ్డి మోడల్ ఫార్మర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. మిలటరీ టైపు జీపులో తన ఫామ్ ల్యాండ్ కు వెళ్లిన సాయి రెడ్డి.. అందులోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ తీసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.