Vijayasai Reddy ED: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఏపీ సిఐడి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇంకోవైపు ఈడి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈడి నోటీసులతో ఈరోజు వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల కిందటే విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డికి ఈడి నోటీసులు ఇచ్చింది. ఇంకోవైపు రేపు విచారణకు రావాలని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి సైతం నోటీసులు అందాయి. ఈరోజు సాయి రెడ్డి విచారణకు హాజరైన క్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే గతంలో కాకినాడ పోర్టు కేసు విచారణలో భాగంగా సిఐడి ఎదుటకు వచ్చారు విజయసాయిరెడ్డి.. అప్పట్లోనే మద్యం కుంభకోణం కోసం ప్రస్తావించారు. తాను అన్ని వివరాలు ఇచ్చి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల తరువాతే ఈ కేసులో నిందితుల అరెస్టు పర్వం ప్రారంభం అయింది. కానీ అదే కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. ఆయన ఈ కేసులో నిందితుడు తో పాటు సాక్షిగా మారారు. అంతకుమించి వివరాలు ఇస్తూ.. అనధికారికంగా అప్రూవర్ గా మారారన్న టాక్ వినిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆయనతో పాటే 16 నెలల జైలు జీవితం కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి మించి విజయసాయిరెడ్డి కృషి చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం విజయసాయి రెడ్డికి అన్నలేని ప్రాధాన్యమిచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి క్రమేపి దూరమయ్యారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న నేతలతో విజయసాయిరెడ్డికి పడడం లేదు. ఆ కారణం చెప్పి తాను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లు రాజీనామా లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి ఫేవర్ చేసినట్టు మాట్లాడారు. ఇటీవలే కోటరీ పై మరోసారి బాంబు పేల్చారు. వారు అమ్ముడు పోయారని అర్థం వచ్చేలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బలహీనమవుతున్నారని కూడా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈడి ఎదుటకు విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన ఎటువంటి కామెంట్స్ చేస్తారా? అని అందరిలోనూ ఒక ఆత్రుత ఉంది.
నిందితుడిగా ఉన్నా..
మద్యం కుంభకోణం( liquor scam) కేసులో విజయసాయిరెడ్డి సైతం నిందితుడే. ఆయన ఏ5 గా ఉన్నారు. కానీ మిగతా నిందితులంతా అరెస్టయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లాంటి వారు ఇప్పటికే అరెస్టయ్యారు కూడా. కానీ ఏ 5 గా చూపే విజయసాయి రెడ్డిని మాత్రం టచ్ చేయలేదు. అయితే ఆయన నుంచి వివరాలు సేకరించి మద్యం కుంభకోణం కేసులో పట్టు బిగించాలన్నది సిఐడి ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎలాంటి వివరాలు ఇస్తారో అన్నది చూడాలి. రేపు ఇదే ఈడి ఎదుటకు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే ఈ లోపల ఎటువంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి. విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటివి ఉంటాయా అన్న అనుమానం లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..