Vijayananda Reddy: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎంపిక.. వైసీపీలో వివాదాస్పదం అవుతోంది. వైసిపి అభ్యర్థిగా ఖరారైన మెట్టపల్లి చిన్నపరెడ్డి విజయానంద రెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఆయన గతంలో స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయ్యారు కూడా. అటువంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్టబెట్టడం పై పార్టీలోనే ఒక రకమైన చర్చి నడుస్తోంది. పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఎంపిక పార్టీకి శ్రేయస్కరం కాదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.
విజయానంద రెడ్డి ఒక కారు డ్రైవర్. అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. అక్రమార్జునను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారని చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట విజయానంద రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది వైసిపి అభ్యర్థులకు ఆయనే పెట్టుబడి పెట్టారని పొలిటికల్ వర్గాల్లో చర్చ అయితే ఒకటి ఉంది. ఆయనపై కెవిపల్లె, పీలేరు, పాకాల, చిత్తూరు ఒకటో పట్టణ, బంగారుపాళ్యం తదితర పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. 2014లో ఆయనపై పిడి చట్టం కూడా ప్రయోగించారు. జైలుకు పంపించారు.
విజయానంద రెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో విజయానంద రెడ్డి ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు. అయితే ఇంతకుముందు విజయానందరెడ్డి గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తగా కూడా పనిచేశారు. 2014లో విజయానంద రెడ్డి మరింత హాట్ టాపిక్ గా మారారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసే క్రమంలో 20 రోజులపాటు విమానాల్లోనే తిరిగినట్లు ప్రచారం ఒకటి ఉంది. అక్కడికి కొద్ది రోజులకే పోలీసులకు పట్టు పడడంతో జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ల పాటు పీలేరు సబ్ జైల్లో, మరికొన్నాళ్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన గడిపారు. ఆది నుంచి జగన్ తో విజయానంద రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకసారి విజయానంద రెడ్డి ఇంటికి జగన్ వచ్చారు. 2014 జనవరి 23న సమైక్య శంఖారావ యాత్ర సందర్భంగా విజయానంద రెడ్డి ఇంట్లో జగన్ బస చేశారు. తీవ్ర నేరారోపణలు ఉన్న విజయానంద రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడం పార్టీలోనే ఓకింత ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఇలాంటి సంచలనాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని పార్టీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.