https://oktelugu.com/

Vijayamma: ఎట్టకేలకు బయటకొచ్చిన విజయమ్మ.. జగన్, షర్మిల వివాదంపై సంచలన వీడియో రిలీజ్

గత కొద్దిరోజులుగా తన వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు విజయమ్మ నేరుగా రంగంలోకి దిగారు. మీడియాకు ఒక వీడియోను పంపించారు. అందులో విజయమ్మ అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 7:57 am
    Vijayamma

    Vijayamma

    Follow us on

    Vijayamma: ఆమె లేఖ రాసిన విధానాన్ని సాక్షి తప్పు పట్టింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రలో విజయమ్మకు కూడా పాత్ర ఉందని ఆరోపించింది. వాస్తవానికి ఆ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీనిని ఓవర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఇదే క్రమంలో ఆమధ్య విజయమ్మ వాహనం పాడైపోతే.. దాని వెనుక రకరకాల కథనాలు అల్లింది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తారాస్థాయికి వెళ్ళింది. ఒక పార్టీ అయితే విజయమ్మ కారు పాడైన ఘటనను మరో విధంగా చిత్రీకరించింది. ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగం నాయకులైతే మరింత విష ప్రచారానికి దిగారు. ఇది జగన్మోహన్ రెడ్డికి మరింత వ్యతిరేకంగా మారింది. దీనిపై ఏ ఒక్క వైసీపీ నాయకుడు స్పందించలేదు. ఇదే అదునుగా ఓ పార్టీ నాయకులు మరింత రెచ్చిపోయారు. సరికొత్త ఆధారాలతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు విజయమ్మ విదేశాలకు వెళ్లడం వెనుక కూడా సంచలన కారణాలు ఉన్నాయని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే దీనిపై నిన్నటి వరకు ఎవరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి విజయమ్మ స్పందించారు. స్వయంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. అది ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది.

    వ్యక్తిత్వ హననం వద్దు

    గత కొద్దిరోజులుగా తన వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు విజయమ్మ నేరుగా రంగంలోకి దిగారు. మీడియాకు ఒక వీడియోను పంపించారు. అందులో విజయమ్మ అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారు..” నా వాహనం పాడైతే.. దానిని ఏదో ఘటనకు ముడిపెట్టారు. నేను నా మనవడి దగ్గరికి వెళ్తే మరో విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఏ ఇంట్లో అయినా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వ్యక్తుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉంటాయి. దానిని గౌరవించాలి. ఆస్తుల విషయంలో షర్మిల, జగన్ మధ్య విభేదాలు ఉన్నది వాస్తవం.. అవి మీ కుటుంబాలలో జరగడం లేదా? అలాంటివి మీ కుటుంబాలలో చోటు చేసుకోవడం లేదా? దీనిని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తారు.. వ్యక్తిత్వ హనానికి ఎందుకు పాల్పడతారు? మీడియా వార్తలు రాస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వార్తలు రాస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తుల జీవితాలను నాశనం చేయొద్దు. వారి జీవితాలను ప్రభావితం చేసే విధంగా వార్తలను రాయకూడదు. ఇటీవల నా వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి రకరకాల వార్తల వినిపిస్తున్నప్పుడు నేనే లేఖ రాశాను. ఆ లేఖ ఫోర్జరీ కాదు. అందులో ఉన్న సంతకం కూడా నాదే. దీనిపై కూడా రకరకాల వక్రీకరణలు చేస్తున్నారు. ఇది సరైన చర్య కాదని” విజయమ్మ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

    వారికి చెంపపెట్టు

    విజయమ్మ వీడియో ద్వారా ఎన్ని రోజులపాటు రకరకాల ప్రచారాలు చేసిన వారికి చెంపపెట్టు లాంటి సమాధానం లభించినట్లు అయిందని వైసీపీ నాయకులంటున్నారు. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డిని అకారణంగా విమర్శించారని.. ఇప్పుడు నేరుగా వారి అమ్మే స్పష్టత ఇచ్చిందని.. ఇంకా వీటికి ఎలాంటి రుజువులు కావాలని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.. త్వరలోనే జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముగుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.