YS Vijayamma: విజయమ్మ లేఖ..డిఫెన్స్ లో జగన్.. టిడిపికి ఆయాచిత వరం

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో నెలకొన్న వివాదం సెగ రేపుతోంది. విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతుంది.

Written By: Dharma, Updated On : October 30, 2024 10:30 am

YS Vijayamma

Follow us on

YS Vijayamma: వైసిపి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసింది. నేతలు మూకుమ్మడిగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న అనుమానం వెంటాడుతోంది.దీనికి తోడు కుటుంబంలో ఆస్తి వివాదాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పటివరకు బాహటంగా జగన్ వైఖరిపై షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆస్తి పంపకాల్లో తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ వచ్చారు.దానికి బలం చేకూరుస్తూ వైయస్ విజయమ్మ సైతం బహిరంగ లేఖ రాశారు. కూతురు షర్మిల వైపే నిలిచారు. ఆమె విడుదల చేసిన లేఖ పూర్తిగా కుమార్తెకు మద్దతుగా ఉంది.దీంతో వైసిపి డిఫెన్స్ లో పడింది. విజమ్మ లేఖకు కౌంటర్ గా వైసీపీ సైతం మరో లేఖ విడుదల చేసింది. అయితే విజయమ్మ విడుదల చేసిన లేఖలో కుటుంబ పరమైన సున్నిత అంశాలు ఉన్నాయి. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారాస్త్రంగా మారనున్నాయి.

* అవినీతి అంశంగా
అయితే ఈ ఎపిసోడ్లో వైయస్ కుటుంబ ఆస్తి వివాదం కాస్త.. అవినీతి అంశంగా మార్చేందుకు టిడిపి ప్రయత్నాలు ప్రారంభించింది. సరస్వతీ పవర్ కంపెనీలో షేర్ల విషయంలోనే కుటుంబంలో విభేదాలు వచ్చాయి. అయితే అది రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు పేదల నుంచి సేకరించిన భూమి. అక్కడ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఎటువంటి ఉత్పత్తి జరగలేదు. అటువంటిప్పుడు పేదల నుంచి సేకరించిన భూములు వారికే ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ప్రజల భూమిని వైయస్ తన అధికారంతో కుటుంబాన్ని కట్టబెట్టారని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అది అంతిమంగా జగన్ కే నష్టం చేకూరుస్తుంది.

* షర్మిలకు వచ్చే నష్టం లేదు
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు.అయితే ఈ వివాదం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు.అలాగని షర్మిలకు వ్యక్తిగతంగా డ్యామేజ్ జరిగే పరిస్థితి లేదు. ఈ విషయంలో జగన్ కు భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. తాజా ఘటనతో ఈ ఆరోపణలు నిజం అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయనుంది.