AP Assembly 2024: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు వారం రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికార ప్రకటన వెల్లడి కానుంది.ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఓటాన్ బడ్జెట్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. గత అసెంబ్లీ సమావేశాల్లో తాత్కాలిక బడ్జెట్ తో సరిపెట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన కొన్ని జీవోలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అందుకే ఈ సమావేశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
* జగన్ హాజరుపై సందిగ్ధత
అయితే ఈ శీతాకాల సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారా?లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది.175 అసెంబ్లీ స్థానాలకు గాను..కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరయ్యారు. అటు తరువాత రకరకాల కారణాలు చెబుతూ సమావేశాలకు గైర్హాజరవుతూ వచ్చారు.
* అనుమానమే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం అనుమానమే.ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో ఉన్న బలం 11 మంది మాత్రమే.వారిలో కూడా ఒకరిద్దరూ వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు.అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీకి టార్గెట్ కావడం కంటే..వెళ్లకపోవడమే ఉత్తమమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.